Kesineni_Nani_Kesineni_Sivanathకేశినేని సోదరుల మద్య కొనసాగుతున్న వివాదం టిడిపికి తలనొప్పిగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ల మద్య చాలాకాలంగా విభేధాలు కొనసాగుతున్నాయి. తనను కాదని తన తమ్ముడికి టిడిపి ప్రాధాన్యం ఇస్తుండటాన్ని కేశినేని నాని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కేశినేని శివనాథ్‌ వర్గంలోవారందరూ కలిసి తనపై బురద జల్లుతూ అప్రదిష్టపాలుచేయాలని ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారందరినీ పార్టీలో నుంచి తక్షణం బయటకి పంపించేయాలని కేశినేని నాని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎన్నికలు దగ్గర పడగానే కొంతమంది ఫౌండేషన్‌లు, ట్రస్టులు అంటూ ఓ వంద మందికి చీరలు, పదిమంది వికలాంగులకి ట్రైసైకిళ్ళు పంచి తమంత గొప్ప సమాజసేవకులు లేరన్నట్లు మాట్లాడుతుంటారని, పార్టీ కార్యకర్తలకి డబ్బులు పంచి జై కొట్టించుకొంటారని కేశినేని నాని ఎద్దేవా చేశారు. లోఫర్లు, భూకబ్జాలకి పాల్పడినవారు పెద్ద రాజకీయనాయకుల్లా నగరంలో ఫ్లెక్సీ బ్యానర్లు వేసుకొని చాటింపు వేసుకోవడం చూసి నవ్వొస్తోందని కేశినేని అన్నారు.

వచ్చే ఎన్నికలలో ఇటువంటి వారికి టిడిపి టికెట్స్ ఇస్తే వారికి తన నుంచి ఎటువంటి మద్దతు లభించదని, తాను కూడా టిడిపి తరపున పోటీ చేయడంపై పునరాలోచించుకోవలసి వస్తుందని కేశినేని నాని అన్నారు. తనకి పార్టీ టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు కోరుకొంటే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవగల సత్తా తనకుందని కేశినేని నాని అన్నారు.

రాజకీయాలలో ఉన్నా లేకపోయినా టాటా ట్రస్ట్ వంటి సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటానని కేశినేని నాని అన్నారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ ఇండియాలో తన ట్రావెల్స్ సంస్థ అగ్రగామిగా ఉండేదని, ఓ సారి మీరు వ్యాపారవేత్తగా మాట్లాడుతున్నారా లేదా ఎంపీగా మాట్లాడుతున్నారా? అని మీడియా ప్రశ్నించినందుకు ఆ వ్యాపారాన్నే వదిలేసుకొన్నవాడినని, కనుక ఇటువంటివారు తనకు పోటీయే కాదన్నారు ఎంపీ కేశినేని నాని.

రాష్ట్ర విభజనకి ముందు అంటే 2013లో టిడిపి నుంచి వైసీపీలోకి జోరుగా వలసలు సాగుతుండేవని కానీ తాను టిడిపిలో చేరిన తర్వాతే పార్టీలో వలసలు ఆగిపోయాయని లేకుంటే పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేదన్నారు. కనుక తన తమ్ముడు కేశినేని శివనాథ్‌, అతని అనుచరుల విషయంలో చంద్రబాబు నాయుడు తక్షణం సరైన నిర్ణయం తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్‌ చేశారు.

వచ్చే ఎన్నికలలో వైసీపీ, టిడిపిల మద్య చాలా తీవ్రస్థాయిలో పోటీ ఉంటుంది. కనుక ఆర్ధికంగా, రాజకీయంగా, కులపరంగా బలం ఉన్న ప్రతీ ఒక్క నాయకుడు టిడిపికి చాలా అవసరమే. ఎంపీ కేశినేని నాని కాస్త ఎక్కువగా సొంత డప్పు వాయించుకొన్నట్లు అనిపించినప్పటికీ విజయవాడలో ఆయన తిరుగులేని నాయకుడని అందరికీ తెలుసు. కనుక చంద్రబాబు నాయుడే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది లేకుంటే కీలకమైన వచ్చే ఎన్నికలలో విజయవాడలో టిడిపికి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.