Fourteen Kapu TDP Leaders Secret Meeting in Kakinadaతెలుగుదేశం పార్టీకు చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు భాజపాలో చేరనున్నారనే వార్తల నుండి తేరుకోక ముందే ఆ పార్టీ మీద ఇంకో పిడుగు పడింది. ఆ పార్టీకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. కాకినాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాపు సామాజిక వర్గానికి చెందిన 14 మంది తెదేపా నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది.

పార్టీను వీడి భాజపా లేదా వైకాపాలో చేరే విషయమై వీరంతా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్‌, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళ్రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు, పంచకర్ల రమేశ్‌బాబు, ఈలి నాని ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ వార్తలు టీడీపీ అభిమానులను ఎంత కలవరపెడుతుందో బీజేపీ అభిమానులను కూడా అంతే కలవరపెడుతుంది.

వీరంతా పార్టీని చూసి చేరడం అయితే లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కేంద్ర ఏజెన్సీల నుండీ తమను తాము కాపాడుకోవడానికే ఈ పక్క చూపులు అని వారికి ఖచ్చితంగా వారికి తెలుసు. వీరంతా ఐదు సంవత్సరాలు భాజపాలో గడిపేసి ఆ తరువాత ఎన్నికల ముందు మళ్ళీ తమ దారి తాము చూసుకుంటారని వారు అనుమానిస్తున్నారు. అప్పుడు ఉన్నఫళంగా వీరంతా పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతే బీజేపీ మొత్తానికి మునిగిపోతుందని బీజేపీ అభిమానుల ఆందోళన.