TDP_JANASENA_YSRCP_KCRరాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేవలం అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించాల్సి ఉండగా రాజకీయాలు, కక్ష సాధింపులు, సామాజిక మాద్యమాలలో నేతల బూతులు, ఎన్నికలు, ఓట్లు, అప్పులు, పధకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వైఖరి, ఆలోచనలు, దాని విధానాలు ఏవిదంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఆ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పవచ్చు. అధికారంలో ఉండటం ఓ కారణమైతే, రాజకీయ చదరంగంలో తెలివిగా పావులు కదుపుతూ ప్రత్యర్ధులను చావు దెబ్బ తీస్తుండటం మరో కారణంగా కనిపిస్తోంది. ఇది నైతికమా అనైతికమా?అనే సందేహాన్ని పక్కనపెట్టి చూస్తే వైసీపీ రాజకీయంగా చాలా బలంగా ఉందనే విషయం సుస్పష్టం.

ఇక వైసీపీ ఎంతగా పట్టి పీడిస్తున్నప్పటికీ టిడిపి, జనసేనలు కూడా ఎదురొడ్డి పోరాడుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తకొత్త వ్యూహాలతో వైసీపీని ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఢీకొని ఓడించి రాష్ట్రంలో తప్పకుండా అధికారంలో రాగలమనే గట్టి నమ్మకంతో రెండు పార్టీలు పోరాడుతున్నాయి. అంటే రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదని అర్దమవుతోంది. కానీ అధికార విపక్షాల బలాబలాలు ఇంచుమించు సరిసమానంగా ఉండటంతో రాష్ట్రంలో ఓ రకమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తోంది. అంటే వచ్చే ఎన్నికలలో మళ్ళీ వైసీపీ గెలిస్తుందా లేదా దానిని ఓడించి టిడిపి, జనసేనలు అధికారంలోకి వస్తాయా?అనే చర్చ సాగుతోంది.

దీనినే తెలంగాణ సిఎం కేసీఆర్‌ రాజకీయశూన్యతగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరైన నాయకత్వం లేదనే సాకుతో తెలంగాణ కేసీఆర్‌, సంక్రాంతి పండుగ తర్వాత తన బిఆర్ఎస్‌ రధం మీద ఏపీకి రాబోతున్నారు. ఆయనకి జేజేలు పలికి హారతులు ఇచ్చేందుకు అప్పుడే కొంతమందిని అపాయింట్ చేసుకొన్నారు కూడా. వారు బహుశః ఆయనకి స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉండి ఉంటారు.

ఏపీలో ఇప్పటికే అధికార, విపక్షాల మద్య రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతుంటే కేసీఆర్‌ ప్రవేశంతో ఏపీ రాజకీయాలు మరింత బ్రష్టుపట్టిపోవడం ఖాయం. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఓసారి నష్టపోయిన ఏపీలో మూడు రాజధానులతో కంటికి కనబడని మరో పెను రాజకీయ విధ్వంసమే జరుగుతోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు ఇప్పుడు కేసీఆర్‌ కూడా రాష్ట్రంలో కుల రాజకీయాల చిచ్చు రగిలించేందుకు తరలివస్తున్నారు.

ఒకవేళ వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఏపీలో గెలిచినా ఓడినా కేసీఆర్‌కి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కనుక ఎన్నికల తర్వాత ఆయన చేతులు దులుపుకొని మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోతారు. కానీ వచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ గందరగోళం సృష్టిస్తే, ఆంధ్రా ప్రజలు ఆ మాయాజాలంలో చిక్కుకొంటే ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ ఎన్నటికీ కోలుకోలేదు. కనుక వచ్చే ఎన్నికలలో ఏపీ ప్రజలు చాలా విచక్షణతో ఆలోచించి ఓట్లు వేసి సరైన నాయకుడిని, సరైన పార్టీని ఎన్నుకోవలసి ఉంటుంది. లేకుంటే తమ తప్పిదానికి మరో ఐదేళ్లు ప్రజలే మూల్యం చెల్లించుకోకతప్పదు.