TDP Janasena Parties AP Roads Issueఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అధికార వైసీపీ నేతలు మా వంటి గొప్ప ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు… జగనన్న పాలన అందరికీ ఆదర్శం అని చెప్పుకొంటుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నా అంత ఉదారహృదయుడు, పేదల పెన్నిది మరొకడు లేడు… పుట్టబోడు” అంటూ భుజాలు చరుచుకొంటుంటారు.

ఇక రోజూ తెల్లారగానే జనసేన పార్టీ ‘గుడ్ మార్నింగ్ సిఎం సర్‌’ అంటూ పలకరిస్తూనే రాష్ట్రంలో గుంతలు పడి చెరువులుగా మారిన రోడ్లలో మొక్కలు నాటుతూ, బట్టలు ఉతుక్కొంటూ, స్నానాలు చేస్తూ ఫోటోలు, వీడియోలు దిగి సోషల్ మీడియాలో పెడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డికి మనశాంతి లేకుండా చేస్తున్నారు.

రోడ్లు అలియాస్ రోడ్ల అవశేషాలు అలియాస్ గుంతల రోడ్లు అలియాస్ గొలుసుకట్టు చెరువుల ఫోటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోతోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు జూలై 15వ తేదీలోగా రాష్ట్రంలో రోడ్లన్నీ మంత్రదండం తిప్పి కొత్తరోడ్లలాగా మార్చేస్తాని అన్నారు కదా…సిఎం సార్.. ఇంకా తిప్పలేదా? అంటూ మళ్ళీ ఎకసక్కేలొకటి.

ఇలాంటి విషయాలలో ఎప్పుడూ ముందుండే టిడిపి కూడా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కళ్ళకు కట్టినట్లు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుండటం జగన్ సర్కారుకు పుండు మీద కారం జల్లినట్లే ఉంటుంది మరి. టిడిపి, జనసేనలు మరేదైనా అంశం లేదా ప్రజా సమస్యపై నిలదీస్తే వెంటనే విరుచుకుపడిపోయే అంబటి, కొడాలి, బొత్స, సజ్జల, రోజా వంటివారు ఈ ఒక్క అంశంపై నోరు మెదపడం లేడు. వారు స్పందిస్తే విని తరించాలని రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోపక్క నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు, కార్యకర్తలు జగన్ సర్కారుని బాదుడే బాదుడు అంటూ ఉతికి ఆరేస్తూనే ఉన్నారు. ఆ దెబ్బకి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు గడప గడపకు కార్యక్రమానికి రావడం మానేశారు. కానీ టిడిపి, జనసేనలు రాష్ట్రంలో పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నా మావంటి అత్యుత్తమ ప్రభుత్వం ఈ దేశంలోనే కాదు… ఈ భూమండలంలోనే లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అదృష్టం కొద్దీ జగనన్న ఏపీలో పుట్టారు. అదే 50-75 ఏళ్ళ క్రితమే పుట్టి ఉండి ఉంటే మన రాష్ట్రం పరిస్థితి వేరే విదంగా ఉండేది. అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. మరో 20-30 ఏళ్ళు జగనన్నే రాష్ట్రాన్ని పాలించబోతున్నారు కనుక అంతా లెవెల్ చేసేస్తారని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెపుతున్నారు. దేశ ప్రజల అదృష్టం బాగుంటే మన జగనన్న ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని చెపుతున్నారు.