TDP Janasena attended Undavalli Aruna Kumar meetవిజయవాడలోని ఐలాపురం హోటల్‌లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో విభజన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయంపై అఖిలపక్షం, మేధావుల సమావేశం నిర్వహిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వకపోవడంపై ఉండవల్లి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరుకావాలని అన్ని పార్టీలకు ఆయన లేఖలు రాశారు. వీటిపై వచ్చే ఐదేళ్లు ఏం చెయ్యాలనే దానిపై ఒక అంగీకారానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

సహజంగా ఉండవల్లి టీడీపీ వ్యతిరేకి కాబట్టి ఆ పార్టీ ఈ సమావేశానికి హాజరు కాదని అందరూ భావించారు. ఆశ్చర్యకరంగా ఉండవల్లి లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉండవల్లి సమావేశానికి హాజరుకావాలని టీడీపీ నిర్ణయించింది. సమావేశానికి ఎంపీ సీఎం రమేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి ఆనందబాబును పంపాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఉండవల్లి వైఎస్సాఆర్ కాంగ్రెస్ చెలిమి అందరికీ తెలిసినా ఆయన ఆహ్వానాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తిరస్కరించింది.

ఆ పార్టీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తమకు ఉండవల్లి అంటే గౌరవమేని, అయితే తెలుగుదేశం పార్టీనే ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణమని ,ఆ పార్టీ మంత్రులు హాజరయ్యే సమావేశానికి తాము వెళ్లడం లేదని అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, సీపీఐ నేత రామకృష్ణ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన నేతలందరినీ ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గరుండి లోనికి ఆహ్వానించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ కూడా ఈ సమావేశానికి వస్తుండడం విశేషం. ఆ పార్టీ తరపున ఐవైఆర్ కృష్ణారావు హాజరు అవుతున్నారు.