Pawan Kalyan Chandrababu Naiduజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందాలనుకోవడం లేదని పొత్తులతోనే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ఇదివరకు టిడిపితో విభేధించినప్పటికీ నిరంకుశ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టిడిపితో పొత్తులు పెట్టుకొంటామని స్పష్టం చేశారు.

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడుని కలిస్తేనే భగభగ మండిపోయే మంత్రులు, వైసీపీ నేతలు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఊరుకోరు కనుక చాలా తీవ్రంగా ఆయనపై విరుచుకు పడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తుల గురించి ఆలోచిస్తుంటే బిజెపి అభ్యంతరం చెప్పాలి కానీ బిజెపి మౌనంగా ఉండిపోతుంటే, జనసేనతో ఏ సంబందమూ లేని వైసీపీ మాత్రం భగభగ మండిపోతుందటమే చాలా గమ్మత్తుగా ఉంది.

Also Read – కేసీఆర్‌ చేతికి మళ్ళీ సెంటిమెంట్ ఆయుధాలు… అవసరమా?

నిజానికి టిడిపితో పొత్తులు పెట్టుకోవడానికి పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ నేతల పర్మిషన్ తీసుకోనవసరం లేదు. వైసీపీలాగే జనసేన కూడా ఓ రాజకీయపార్టీ కనుక దాని రాజకీయ మనుగడ కోసం ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకొనే పవన్‌ కళ్యాణ్‌కి అధికారం ఉంది. ఇప్పటికే జనసేన ఓసారి ఎన్నికలలో ఎదురుదెబ్బతిన్నందున ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేయడం చాలా అవసరం. రాబోయే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకొంటామనే భ్రమలో వైసీపీ ఉంటే ఉండొచ్చు కానీ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం జనసేన పార్టీయే గెలుస్తుందని, తానే ముఖ్యమంత్రి అవుతాననే భ్రమలలో లేరు. కనుకనే పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని టిడిపితో పొత్తులకి సిద్దపడుతున్నారు. వైసీపీ కోరుకొన్నట్లు ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందాలనుకోవడం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఒకవేళ ఈ ఎన్నికలలో తప్పటడుగు వేస్తే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి జనసేన మళ్ళీ 5 ఏళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రంలో టిడిపి,జనసేనలు కనబడకుండా చేసినా చేయవచ్చు. కనుక మరో తప్పు చేయడానికి రెండు పార్టీలకి అవకాశం లేవు. అందుకే రెండూ కలిసి తమ మనుగడ కోసం అంతిమ పోరాటానికి సిద్దం అవుతున్నాయని చెప్పవచ్చు. కనుక ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో విజయమో… వీరస్వర్గమో అన్నట్లు పోరాడబోతున్నాయి.

Also Read – ఏపీకి రివర్స్ గేర్ పడి నేటికీ సరిగ్గా 5 ఏళ్ళు!

వాటి పోరాటం వలన వైసీపీ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే టిడిపి, జనసేనలు ఎట్టి పరిస్థితులలో కలవకుండా అడ్డుకోవాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు ఎంతగా రెచ్చగొట్టినా వారిది వృధా ప్రయాసే అని పవన్‌ కళ్యాణ్‌ నిన్న మరోసారి కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారు.

కనుక వైసీపీ నేతలు వాటిని దూరంగా ఉంచాలనే ఆలోచనలు మానుకొని, ఆ రెండూ కలిసివస్తే ఏవిదంగా ఎదుర్కోవాలో ఆలోచిస్తే వారికే మంచిది. కాదని ఇలాగే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని ఉద్దేశ్యించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే రాష్ట్రంలో వారిద్దరితో ముడిపడున్న అనేక వర్గాల ప్రజలు వచ్చే ఎన్నికలలో వైసీపీని చావు దెబ్బ తీయడం ఖాయం.

Also Read – కడప కబుర్లు: వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారట!