TDP-Gouthu-Sireeshaశ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణం జీడిపప్పుకు ప్రసిద్ధి అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఫ్యాక్షనిజంతో కొత్త గుర్తింపు పొందుతోంది. పలాస మండల టిడిపి అధ్యక్షుడు కుత్తుమ్ లక్ష్మణరావు ఆదివారం తనకారులో వెళుతుండగా దారిలో రామకృష్ణాపురం వద్ద ఐదుగురు వ్యక్తులు కాపుకాసి అడ్డుకొని దాడి చేశారు. అయితే అది చూసి స్థానికులు పరుగున రావడంతో దాడి చేసినవారు అటుగా వస్తున్న బస్సు ఎక్కి సోంపేటవైపు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకొని టిడిపి మహిళా నేత గౌతు శిరీష వెంటనే అక్కడకు చేరుకొని లక్షణరావుని అంబులెన్సులో సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ దాడిలోలక్షణరావు తీవ్రంగా గాయపడ్డాడు కానీ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

గౌతు శిరీష హాస్పిటల్‌ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ, “మా చిన్నప్పుడు కడప జిల్లాలో ఇలా పరస్పరం దాడులు చేసుకొనేవారని విన్నాను. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప ఫ్యాక్షనిజం పలాస వరకు విస్తరించిందని ఈ ఘటనతో రుజువైంది. పశువులశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మా పార్టీ నేత లక్ష్మణరావుపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే, “నువ్వు మంత్రిగా ఉన్నావు… మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయడం ఎందుకు? విచారణ జరిపించవచ్చు కదా? నాపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించవచ్చు కదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకొన్నారు?” అంటూ ప్రతిసవాల్ విసిరారు.

అప్పుడు మంత్రి సీదిరి ఆ సవాలును స్వీకరించి విచారణ జరిపిస్తే బాగుండేది. కానీ తన గూండాలతో లక్ష్మణరావుపై ఈవిదంగా దాడి చేయించారు. సమయానికి స్థానికులు అక్కడకి చేరుకోలేకపోయుంటే వాళ్ళు లక్షణరావుని హత్య చేసేవారే. తనపై దాడి చేసినవారిలో వైసీపీ నేత నర్తు నరేంద్ర తమ్ముడు నట్టు ప్రేమ్ ఉన్నాడని లక్షణరావు స్వయంగా చెపుతున్నా పోలీసులు ఆయన మాట పట్టించుకోకుండా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పడం చూస్తే వారి దర్యాప్తు ఏవిదంగా జరుగబోతోందో అర్దం అవుతోంది. లక్ష్మణరావుపై దాడి చేసిన వైసీపీ గూండాలని పోలీసులు తక్షణం అరెస్ట్ చేయకపోతే నేను న్యాయపోరాటం మొదలుపెడతాను,” అని గౌతు శిరీష హెచ్చరించారు.