GowruCharithaReddy-TDPటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టిడిపి ఇన్‌ఛార్జి గౌరుచరిత నేతృత్వంలో ఆదివారం కల్లూరు అర్బన్‌లో 26వ వార్డులో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, స్థానిక టిడిపి నేతలు సౌజన్య, క్యాతుం మధు, బీసన్న, గంగాధర్ గౌడ్, మాదేశ్, ఎస్.పి. రోజ్, ఎన్‌వి రామకృష్ణ, కాసాని మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వారు వార్డులో ఇంటింటికీ వెళ్ళి జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటిని తిరిగి ఏవిదంగా ప్రజలపై చెత్తపన్ను, ఇంటిపన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా వసూలుచేసుకొంటోందో వివరించే కరపత్రాలను పంచిపెట్టారు. సంక్షేమ పధకాల మాయలో పడి మళ్ళీ వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓట్లు వేసి మోసపోవద్దని, ఇప్పుడు భూములు అమ్ముకొంటున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్నే అమ్మేస్తారని, రాష్ట్రం శ్రీలంకలా దివాళా తీస్తుందని తెలియజేశారు.

ఈ సందర్భంగా గౌరు చరిత ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ఓ వైపు పాఠశాలలు మూసివేస్తూ, మరోపక్క వందలకోట్ల ప్రజాధనం ఖర్చుచేస్తూ అవే పాఠశాలలలో నాడు-నేడు రెండో విడత కార్యక్రమంలో భాగంగా మరమత్తులు చేయించి, ఎందుకు రంగులు వేయిస్తోందని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఇటువంటి ప్రయోగాలు చేస్తూ విద్యావ్యవస్థను కూడా భ్రష్టు పట్టించేస్తోందని అన్నారు. పాఠశాలల విలీనం వలన విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కనుక ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.