Gali-Bhanu-Prakash-TDP-సిఎం జగన్మోహన్ రెడ్డి తాను బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు పడిపోతున్నాయని గొప్పగా చెప్పుకోవడంపై తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాశ్ తప్పు పట్టారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గుండ్ల పుత్తూరు, భవానీ నగర్‌లో పార్టీ నేతలతో కలిసి పర్యటించినప్పుడు, ప్రజలతో మాట్లాడుతూ, “ఓ ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటి? రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం. ప్రజా సమస్యలను పరిష్కరించడం. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. అన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా రాష్ట్రంలో కనీసం రోడ్లు మరమత్తులు చేయించలేకపోయారు. బటన్ నొక్కడమే ఘనకార్యమన్నట్లు నిసిగ్గుగా మాట్లాడుతున్నారు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రే ఎందుకు? బటన్ నొక్కడమే ముఖ్యమంత్రి పనా?తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేదం అమలుచేస్తానని చెప్పిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మద్యం అమ్మకాలు పెంచడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వాడుకొంటూ ప్రజల డబ్బు పిండుకొంటూ వారి ఆరోగ్యం కూడా నాశనం చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి, ప్రభుత్వం మనకు అవసరమా?” అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ ధనపాల్, మున్సిపాల్ మాజీ ఛైర్మన్ యుగంధర్, కౌన్సిలర్ కేశవాచారి, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు భాస్కర్ నాయుడు, ఎస్‌కె కేశవ, మునీరాజ, డీజి ధనపాల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.