Nara-Lokesh TDP Former Minister మాజీ మంత్రి పి.నారాయణ అరెస్ట్‌ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగుతున్నప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆ… వాళ్ళ ఫోన్స్ అన్ని టాపింగ్ చేసి ఎవరైతే బాధ్యులున్నారో వాళ్లందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు,” అని అన్నారు.

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ వెంటనే స్పందిస్తూ, “నారాయణగారి ఫోన్‌ టాపింగ్ చేయబడినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెపుతుంటే తెలుసుకొని షాక్ అయ్యాను. మంత్రిగారు స్వయంగా మీడియా సమక్షంలో తమ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్స్ టాపింగ్ చేస్తోందని చెప్పడం చూస్తే, వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతలను ఏవిదంగా వెంటాడి వేటాడుతోందో అర్ధమవుతోంది. ఇది చట్టవిరుద్దం రాజ్యాంగ విరుద్దం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నియంతృత్వ పాలన అమలవుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షా నేతల ఫోన్స్ టాపింగ్ చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తుండటం సిగ్గు చేటు,” అని నారా లోకేష్‌ ట్వీట్స్ చేశారు.

తమ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్స్ టాపింగ్ చేయిస్తున్నట్లు తను ప్రెస్‌మీట్‌లో నోరు జారననే విషయం అప్పుడు కానీ మంత్రి పెద్దిరెడ్డి గ్రహించలేదు. ఈరోజు ఉదయం ఆయన మళ్ళీ మీడియా వద్దకు వచ్చి, “నా మాటలను టిడిపి నేతలు వక్రీకరిస్తున్నారు. నేను ఫోన్‌ ట్రాకింగ్ ద్వారా హైదరాబాద్‌లో నారాయణ ఎక్కడ ఉన్నారో పోలీసులు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకొన్నారని చెపితే, ఆయన ఫోన్‌ టాపింగ్ మా ప్రభుత్వం చేయించిందని నేను అన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు,” అని అన్నారు.

అయితే ఆయన నిన్న సాయంత్రంతో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ టాపింగ్ చేశామని చేసి బాధ్యులను పట్టుకొన్నామని చాలా స్పష్టంగానే చెప్పారు. కానీ ఇవాళ్ళ తాను అలా అనలేదంటున్నారు. తాను ఫోన్‌ ట్రాకింగ్ అంటే ఫోన్‌ టాపింగ్ అని వారికి వినబడి ఉంటుందని అన్నారు. ప్రతిపక్షాల ఫోన్స్ టాపింగ్ చేయించాల్సిన ఖర్మ తమ ప్రభుత్వానికి పట్టలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కనుక ఫోన్‌ టాపింగ్‌కు, ఫోన్‌ ట్రాకింగ్‌కు మద్య తేడా మంత్రిగారికి తెలుసునని అర్ధమవుతోంది. కానీ ప్రెస్‌మీట్‌లో ఫోన్‌ టాపింగ్ చేశామని చెప్పారంటే పొరపాటున అన్నారనుకోలేము. కానీ పొరపాటున నోరుజారి అసలు విషయం బయటపెట్టేశారని అర్ధం అవుతోంది.

ఆ తరువాత తమ ప్రభుత్వం వ్యవవసాయ మోటర్లకు విద్యుత్‌ మీటర్లు పెడుతుండటంపై మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు మోటర్లకు మీటర్లు పెడితే అవి ఉరితాళ్ళే అవుతాయంటూ రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం పారదర్శకత కోసం మోటర్లకు మీటర్లు బిగిస్తున్నాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు,” అని అన్నారు.

చంద్రబాబు నాయుడు వాదిస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు బిగిస్తోందని ఒప్పుకొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్స్ టాపింగ్ చేయిస్తోందనే నారా లోకేష్‌ విమర్శలను మాత్రం వక్రీకరించారంటూ కొట్టి పడేశారు. అయితే రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అదే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు చెపుతున్నారని అర్ధమవుతోంది.