Chandrababu Support Pawan Kalyanటాక్ ఆఫ్ ది స్టేట్ గా “భీమ్లా నాయక్”ను చేయడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయ్యింది. ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ‘భీమ్లా నాయక్’ మాటే వినపడుతోంది. అంతలా ఒక సినిమా కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ నటించిన ఈ సినిమాకు మద్దతు తెలుపుతూ తాజాగా చంద్రబాబు కూడా బరిలోకి దిగారు.

రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తన భావాలను పంచుకున్నారు.

వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్… తన మూర్ఖపు వైఖరి వీడాలంటూ హితవు పలికారు టీడీపీ అధినేత.

రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి… ధియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే… ఆంధ్ర ప్రదేశ్ సీఎం మాత్రం ‘భీమ్లా నాయక్’పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు.

తెలుగుదేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు తన వంతు మద్దతును పవర్ స్టార్ “భీమ్లా నాయక్”కు అందించారు. తన సినిమా కోసమని పవన్ ఇప్పటివరకు ఏ ఒక్క మాట మాట్లాడలేదు గానీ, ఏపీలోని ప్రముఖ రాజకీయ నేతలందరూ మాత్రం పవన్ కు అండగా నిలుస్తున్నారు.

అలాగే నారా లోకేష్ కూడా ‘భీమ్లా నాయక్’పై ట్వీట్ వేశారు. ఈ సినిమాకు వస్తోన్న అద్భుతమైన స్పందన వింటున్నానని, త్వరలోనే చూడాలని నిరీక్షిస్తున్నాను. రాష్ట్రంలో ఒక్కో పరిశ్రమను అడుక్కునే పరిస్థితికి వైఎస్ జగన్ తీసుకువస్తున్నారు, అందుకు సినీ పరిశ్రమ ఏమీ మినహాయింపు కాదు, అన్ని కుట్రలను చేధించుకుని “భీమ్లా నాయక్” విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లుగా నారా లోకేష్ తెలిపారు.