TDP flag in YS rajashekhar reddy fortకేవలం 2,253 మంది ఓటర్ల సంఖ్య మాత్రమే గల చిన్న గ్రామం. అయితేనేం… ఆ గ్రామంలో ప్రస్తుతం అభివృద్ధి పరుగులు పెడుతోంది. మొన్నటిదాకా అడిగినా పట్టించుకోని రాజకీయ పార్టీలు… ఇఫ్పుడు అడగకుండానే అన్నీ చేసేస్తున్నాయి. ప్రజలకు అవసరం ఉన్న పనులనే కాక, అవసరం లేని పనులను కూడా చేస్తూ ఆ గ్రామస్థుల మనసులను చూరగొనేందుకు నానా పాట్లు పడుతున్నాయి. ఇంతకీ ఆ గ్రామం ఏంటిది? ఎక్కడుంది? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే.

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గపు పరిధిలోని, సింహాద్రిపురం మండలంలో గల బలపనూరు గ్రామం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సొంతూరుగా రికార్డులకెక్కిన ఆ గ్రామం… జగన్ కూ ప్రాధాన్యతా గ్రామమే. అయినా ఉన్నట్లుండి ఈ గ్రామంలో ఇంత హడావిడి ఎందుకు? అంటే దానికి సమాధానమే… గ్రామ పంచాయితీ ఎన్నికలు. త్వరలో ఈ గ్రామ పంచాయతీకి ఉప ఎన్నికలు రానున్నాయి.

తొలినాళ్ళ నుండి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన వ్యక్తే ఆ గ్రామానికి సర్పంచ్ గా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ… ఇప్పటిదాకా అసలు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోకే దిగలేదు. అయితే రాజకీయ చదరంగంలో ఆరితేరిన వైఎస్ గతించడం, ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ పై స్థానికంగా వ్యతిరేకం వ్యక్తం అవుతుండడంతో వైఎస్ సొంతూళ్లో పసుపు రంగు జెండా ఎగురవేయాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జగన్ కు కాస్తంత ఇబ్బందికరంగా పరిణమించాయి. ఈ సమయమే వైఎస్ సొంతూళ్లో పాగా వేసేందుకు సరైన సమయమని టీడీపీ భావిస్తోంది.

ఇక తన సొంతూళ్లో వ్యతిరేక ఫలితాలు వస్తే… పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన జగన్ వర్గంలోనూ నెలకొంది. ఈ క్రమంలో గ్రామ ప్రజలు అడగకుండానే ఈ రెండు పార్టీలు ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. గ్రామం చుట్టూ ఉన్న ముళ్ల కంపలను తొలగిస్తున్నారు. రజకులు అడగకున్నా… వారి ఇళ్ల వద్దకు ఇస్త్రీ పెట్టెలు వచ్చి వాలుతున్నాయి. ఇక మట్టి కావాలంటే… ట్రాక్టర్ తో వెళితే సరి, అందులో మట్టి నింపేందుకు ఆ పార్టీలు ఏకంగా ఎక్స్ కవేటర్లను అక్కడ సిద్ధంగా ఉంచాయి. మరి ఉప ఎన్నికల్లో జగన్ సత్తా చాటి తన సొంతూళ్లో బలం నిలుపుకుంటారో?… చరిత్రను తిరగరాస్తూ వైఎస్ ఇలాకాలో టీడీపీ జెండా పాతుతుందో చూడాలి.