Yemmiganur-MLA-BV-Jaya-nageswar-reddy-టిడిపి మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గురువారం కర్నూలు పట్టణంలో 24వ వార్డులో పర్యటించి అక్కడ నివశిస్తున్న బుడగ జంగం ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. తాము కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నా అధికారులు తమకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వడంలేదని, ఆ కారణంగా తమకు ఎటువంటి సంక్షేమ పధకాలు లభించడం లేదని, కనీసం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జయనాగేశ్వర రెడ్డి వారికి ధైర్యం చెప్పారు. సంబందిత అధికారులతో తాను మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఒకవేళ అధికారులు స్పందించకుంటే అసెంబ్లీ సమావేశాలలో తమ పార్టీ ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తుందని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జగన్ నేను విన్నాను… నేను చూశాను… నేనున్నాను… అంటూ నేటికీ గొప్పలు చెప్పుకొంటారు. మూడేళ్ళు గడిచినా ఇటువంటి నిరుపేదల చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోయారు. అయినా గొప్పలు చెప్పుకోవడం మాత్రం మానుకోలేదు,” అని ఎద్దేవా చేశారు.

ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి గ్రామానికి చెందిన ఇమ్మానియోల్ అనే వ్యక్తి మొన్న కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి అక్కడ మార్చురీలో ఉన్న ఇమ్మానియోల్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం టిడిపి నాయకులు సురేశ్ చౌదరి, బాబు, మాజీ సర్పంచ్ కేశన్న తదితరులతో కలిసి అతని కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం వారికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.