TDP doubts on kesineni naniగత కొంత కాలంగా సొంత పార్టీతో ఫేస్ బుక్ యుద్ధం చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ మరో ఆసక్తికర ఫేస్‌ బుక్‌ పోస్ట్‌ చేశారు. ఈసారి ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ తన మనసులో మాటను సూటిగా బయటపెట్టారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని.. భయం తన రక్తంలో లేదని స్పష్టం చేశారు. మరోపక్క నాని పార్టీ మారతారని వదంతులు వినిపిస్తున్నాయి. బీజేపీలోకి వెళ్తారని బయట ప్రచారం గట్టిగా ఉంది.

నాని ఇప్పటికే దీనిని ఖండించినా, ఆయన వ్యవహారశైలి మాత్రం అనుమానాస్పదంగానే ఉందంటున్నారు విశ్లేషకులు. సొంతంగా బయటకు వెళ్ళకుండా పార్టీనే క్రమశిక్షణా చర్యలతో బయటకు పంపేలా ఆయన పరిస్థితులను ఉసిగొలుపుతున్నారా అనే అనుమానం కలగక మానదు. అయితే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అటువంటి చర్యకు ఉపక్రమిస్తుందా అంటే అనుమానమే. ఇది ఇలా ఉండగా ఫేస్ బుక్ లో ఎంపీ నాని ఈ రోజు పెట్టిన పోస్టు పూర్తి సారాంశం ఈ విధంగా ఉంది.

“నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను.నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు” అంటూ నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.