TDP contestants list for 2019 electionsతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఎన్నికల కంటే ముందుగానే అభ్యర్థుల ప్రకటన చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఆ దిశగా అంతర్గత కసరత్తు కూడా చేపట్టారు. తొలుత జనవరిలోనే మొదటి జాబితా ప్రకటించాలని అనుకున్నా ఇప్పుడది ఫిబ్రవరికి మారింది. ఫిబ్రవరిలో తొలి జాబితా విడుదల ఉంటుందని ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాల్లో వినిపిస్తోంది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ తర్వాత అభ్యర్థుల పేర్ల ప్రకటన ఉంటుందని అంటున్నారు

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై ఆ పార్టీ వివిధ జిల్లాల్లో ధర్మ పోరాట సభలు నిర్వహించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలే మిగిలిపోయాయి. ఈ రెండు జిల్లాలకు కలిపి అమరావతిలో సభ జరపాలని నిర్ణయించారు. ఈ సభకు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించాలని సీఎం భావిస్తున్నారు. ఈ సభ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోపు చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తు పూర్తి చేసుకొంటున్నారు.

నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలు తెప్పించుకోవడం, ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా అభిప్రాయ సేకరణ, గత ఎన్నికలతో వివిధ అంశాలను పోల్చి చూడటం వంటివి జరుగుతున్నాయి. జిల్లాల వారీగా ముఖ్య నేతలతో కొన్ని నియోజకవర్గాల పరిస్థితిపై చర్చించడంతోపాటు పీటముడి ఉన్న నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారంపై కూడా సీఎం దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అసంతృప్తులను సముదాయించి ఎన్నికల ప్రచారం ముందుగానే మొదలు పెట్టాలని ప్రణాళికగా ఉంది.

ఫిబ్రవరి చివరిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల అవుతుందని సమాచారం. దీనితో రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టాయి. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఈసారి ఎన్నికలలో ఓడిపోతే జగన్ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో మన్న లేదని చంద్రబాబు అంచనా దీనితో ఎన్నికలలో విజయం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.