నేడు కూడా పార్లమెంట్ లో అదే తంతు నడిచింది. తమకు కావాల్సిన వారితో గొడవ చేయించి సభ ఆర్డరులో లేదు అనే కారణంతో రేపటికి వాయిదా వేయించింది కేంద్రం. రేపు పార్లమెంట్ ఆఖరు రోజు కావడంతో ఇక అవిశ్వాసంపై చర్చకు రావడం అసంభవం అనే చెప్పుకోవాలి. అయితే సభలో ఈరోజు ఆసక్తికరమైన విషయం ఒకటి జరిగింది.
ప్రభుత్వం మోసపూరితంగా అవిశ్వాసాన్ని అడ్డుకోవడంతో విపక్ష ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలిపారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అన్నా డీఎంకే, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. ఈ విషయం బయటకు రాకుండా సాక్షి టీవీ కవర్ అప్ మొదలు పెట్టింది.
మానవహారం విజువల్స్ చూపించి కాంగ్రెస్ టీడీపీ ఒకటైపోయాయి అని, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ తో టీడీపీ చెయ్యి కలిపిందని చెప్పుకుంటూ పోయింది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సోనియా గాంధీ పక్కన పక్కన నించున్న విజువల్స్ ను పదే పదే చూపించింది. టీడీపీ విభజన హామీలపై పోరాడుతుంటే కాంగ్రెస్ వారు ఎస్సి ఎస్టీ చట్టాన్ని తూట్లుపొడవనికి నిరసనగా ఆ కార్యక్రమంలో పాల్గొంది. అవన్నీ మరుగున పెట్టి సాక్షి కొత్త నాటకానికి తెరలేపింది.