Chandrababu-Naidu-Has-Very-Little-To-Worry-About-Scrapping-the-Councilఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన టీడీపీ అందులో నుండి తేరుకునే ప్రయత్నం చేస్తుంది. స్థానిక ఎన్నికలు ముంచుకుని రావడంతో ఎలాగైనా జరిగిన తప్పులను సవరించుకుని మెరుగైన ఫలితాలు రాబట్టే పనిలో పడింది. ఇందులో భాగంగా.. పార్టీ క్షేత్రస్థాయిలో ఎక్కడా బలహీనపడకుండా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు.

నాయకత్వం బలహీనంగా ఉన్నచోట్ల ముఖ్యులను, కార్యకర్తలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. ఏదైనా నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య సరైన సమన్వయం లేకపోతే వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓడిపోయిన నేతలను పిలిచి మళ్ళీ సంఘటితం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

ఎక్కడైనా నేతలు కదలపోయినా, పార్టీ వీడి వెళ్ళిపోయినా అక్కడ కొత్త నేతలను ఇంచార్జీలుగా ప్రకటిస్తున్నారు. పోయిన ఎన్నికలలో జనసేన వల్ల ఎక్కడెక్కడ నష్టం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? బీజేపీ జనసేన పొత్తు వల్ల సమీకరణాలు ఏమైనా మారాయా వంటి వాటిని కూడా భేరీజు వేస్తున్నారు.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి నుండే ఈ దిద్దుబాటు ప్రారంభించారు. 2014 ఎన్నికలలో ఈ జిల్లాలో ఉన్న 15 స్థానాలు టీడీపీ, మిత్రపక్షాల పరం అయ్యాయి. అయితే 2019 ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయిపోయింది. 15 సీట్లలో టీడీపీ కేవలం రెండు మాత్రమే గెలిచింది.