TDP-Chandrababu-Naidu-Idhem-Karmaఈరోజు మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఇదేం ఖర్మ?’ పేరుతో మరో సరికొత్త కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నేటి నుంచి 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ తమ తమ నియోజకవర్గాలలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడుతూనే, ప్రతీ ఇంటికి వెళ్ళి సంక్షేమ పధకాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొంటారు. ఈ మూడున్నరేళ్ళలో వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఏవిదంగా వెనకబడిపోయిందో వివరించి టిడిపిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావలసిన ఆవశ్యకత గురించి వివరిస్తారు. ఈ 45 రోజులు టిడిపి నేతలందరూ ప్రజల మద్యనే ఉంటారు.

తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ సరికొత్త కార్యక్రమంతో మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళబోతోంది.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన పార్టీ ఎల్లప్పుడూ అభివృద్ధి, సమైక్యత, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చింది. కానీ కేవలం మూడున్నరేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించేసింది. వైసీపీ నేతలు, పోలీసులతో కలిసి రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. మొన్న తునిలో అయ్యప్పమాల వేసుకొని వచ్చిన ఓ వ్యక్తి మన టిడిపి నేత శేషగిరిరావుని హత్య చేసేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు నేను నంద్యాలలో పర్యటిస్తుంటే నాపైనే వైసీపీ గూండాల చేత రాళ్ళు వేయించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై భౌతికదాడులు, హత్యాప్రయత్నాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు. తమ బాధ్యతలు మరిచి వైసీపీ నేతలకి సహకరిస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను చాలా మంది ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశాను కానీ ఇంత నీచమైన ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు.

మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల మద్య చిచ్చు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ నేను మూడు రోజులు కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు అమరావతికే మొగ్గుచూపుతున్నామని స్పష్టంగా తెలియజేశారు. అయినా ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకి, వైసీపీ ఎమ్మెల్యేలకి ఇంకా అర్దంకావడం లేదు. వచ్చే ఎన్నికలలో వారికి రాష్ట్ర ప్రజలే తగిన విదంగా బుద్ధి చెపుతారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.