tdp-chandrababu-naidu-secret-notes-banపెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసిన తరువాత ఆంధ్ర‌ప్రదేశ్‌ లో ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఆర్‌బీఐ అధికారులతో నేడు సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తూ ఉండాల‌ని అధికారులకు చెప్పిన చంద్రబాబు, పట్టణ ప్రాంతాల్లో 50 నోట్లను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు రావాల‌ని కోరారు. అలాగే రైతు బజార్లలో ప్ర‌జ‌లు ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచనలు చేసారు.

మరో పక్కన క్యూలో బారులు తీరుతూ ఆదివారం వరకు భారీ ఎత్తున 6,706 కోట్ల రూపాయలను ఏపీ ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసారని స్పష్టం చేసారు. కానీ, బ్యాంకు ఖాతాల్లో వేసుకున్న తమ డబ్బులను తీసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుందని, రెండు వేల రూపాయ‌ల కోసం ఏటీఎంలో సాఫ్ట్‌ వేర్లు అందుబాటులోకి రావాల్సి ఉంద‌ని చెప్పారు. ఒకవేళ వాటి ద్వారా రెండు వేల నోట్లు వ‌చ్చినా చిల్ల‌ర స‌మ‌స్య‌ కూడా ఉంటుందని కూడా చెప్పారు.

ఎప్పటికప్పుడు ప‌రిస్థితుల‌పై బ్యాంకు, ఆర్‌బీఐ అధికారులు వేగంగా స్పందించాలని, 500 నోట్లను కూడా అందుబాటులోకి తేవాల‌ని, ఈ కొత్త‌గా వచ్చిన 500 రూపాయ‌లు నోట్ల‌ను కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేశారని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ ఖాతాదారుల‌ అంద‌రికీ అందించే ప్రయ‌త్నం చేస్తున్న‌ట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్టీసీ నుంచి అన్ని శాఖ‌లు కూడా డిజిట‌ల్ పేమెంట్స్‌ ను స్వీక‌రిస్తే బాగుంటుంద‌ని, నల్లధనాన్ని అరికట్టాలంటే… డిజిట‌ల్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు పెర‌గాల‌ని ప్రజలకు పిలుపునిచ్చారు.

పెద్దనోట్ల ర‌ద్దు వంటి పెద్ద నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు కొన్ని ఇబ్బందులు స‌హ‌జమేన‌ని, వాటిని అధిగ‌మించేందుకు తాము అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, బ్యాంకు ముందు క్యూ లైన్ల‌లో ఉన్న‌ వారికి మజ్జిగ పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. బ్యాంక‌ర్లతో క‌లిసి ప్ర‌భుత్వాధికారులు స‌మ‌న్వ‌యంగా ప‌ని చేస్తున్నారని, ప్ర‌భుత్వ సంస్థ‌లు డిజిట‌ల్ చెల్లింపుల‌ను స్వీక‌రించేందుకు యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఎక్క‌డా పెర‌గ‌లేద‌ని, వదంతుల‌ను ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు.