Chandrababu Naidu-Narendra Modi-Venkaiah Naiduఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోయే రోజు అతి దగ్గరలోనే ఉన్నట్లుగా కనపడుతోంది. ఓ వైపు నుండి తెలుగుదేశం ఎంపీలు కేంద్రం తీరుపై నిరసన గళంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాల్సిన అంశాలపై డిమాండ్ చేసే విధంగా మాట్లాడుతుండడం… మరో వైపు కేంద్రం కూడా అదే స్థాయిలో ఏపీకి చేయాల్సిన అంశాలన్నీ చేసేసామని, విభజన బిల్లులో ఉన్న మిగిలిన అంశాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టమైన ప్రకటన చేయడంతో ప్రస్తుతం టిడిపి – బిజెపి వర్గాల మధ్య ‘కోల్డ్ వార్’ జరుగుతోంది.

చూడబోతుంటే ఈ రెండు పార్టీల మధ్య ‘చినుకు చినుకు కలిసి గాలి వాన’లా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. టిడిపి – బిజెపి బంధం వీగిపోతే కేంద్రంలో ఉన్న బిజెపికి దగ్గరయ్యేందుకు వైసీపీ అధినేత జగన్ గత రెండేళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే. నిజానికి ఈ ముహూర్తం కోసమే జగన్ రెండు సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ కేంద్రం నుండి బయటకు వచ్చేస్తే ఏపీకి నిజంగా లాభిస్తుందా..? అంటే అది ఒక శేషప్రశ్నగానే మిగిలిపోతుంది.

అసలు ప్రభువంలో ఉంటేనే రాష్ట్రానికి అరకొర నిధులతో సరిపెట్టిన మోడీ సర్కార్, నిజంగా ప్రభుత్వం నుండి బయటకు వచ్చి నిరసన తెలియజేస్తే ఆ నిధులు కూడా మంజూరు చేస్తుందా? దీనికి సమాధానం తెలియనిది కాదు. చంద్రబాబు సర్కార్ ఎదుర్కొంటున్న ఇలాంటి సంకట పరిస్థితులను గమనించే ఏపీపై కేంద్రం ‘ఆడింది ఆట, పాడింది పాట’గా పాలన సాగిస్తోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. ఇక దీనికి ‘శుభంకార్డు’ పడిపోవాలన్న అభిప్రాయానికి కాలక్రమేణా మద్దతు పెరుగుతోంది.

ఆనాడూ రాష్ట్ర విభజన సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న మోడీ, వెంకయ్య నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలకు, ఈనాడు అధికారంలో ఉండి చెప్తున్న తప్పించుకునే మాటలకు ఎక్కడా పొంతన లేదు. దీంతో ఏపీ ప్రజానీకంలో కూడా బిజెపి పట్ల వ్యతిరేక భావన అంతకంతకూ పెరుగుతోంది. విభజన సమయంలో కాంగ్రెస్ ఎలాంటి ద్రోహం చేసిందో ప్రస్తుతం బిజెపి కూడా అంతకు మించిన ద్రోహానికి పాల్పడుతోందని ఏపీ ప్రజల మనోవేదన.