TDP - BJP divorce postponedబీజేపీకి దక్షిణ భారత దేశంలో అతిపెద్ద పార్టనర్ టీడీపీ విడాకులకు సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పై సవతి ప్రేమ చూపించడం జీర్ణించుకోలేని చంద్రబాబు బాహాటంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా పరిస్థితిలు ప్రేరేపిస్తున్నాయి. కేంద్రం వైఖరి మార్పు రాకపోతే టీడీపీ ఎన్డీయే నుండి బయటకు రావడం అనేది ఇక లాంఛనమే.

సమయం ఎప్పుడనేది మాత్రం తేలాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు ఆగ్రహం జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. చంద్రబాబు బీజేపీని అతి నమ్మకమైన స్నేహితుడు. స్పెషల్ స్టేటస్ మాట తప్పి పనికిమాలిన స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినా చంద్రబాబు దానిని కూడా సమర్ధించారు. కాకపోతే ఆ ప్యాకేజీ ని కూడా ఆచరణలోకి తీసుకుని రాలేకపోయారు.

ఏడాది పాటు ప్రధాని చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా, జగన్ విజయ సాయి రెడ్డి లాంటి వారిని తరచు కలుస్తున్న చంద్రబాబు బయటపడలేదు. అయితే రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా… రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టె ప్రయత్నం చెయ్యడంతో ఇక చంద్రబాబు సహనం నశిస్తుంది.

ఇప్పుడు బీజేపీ వైఖరిలో మార్పు రావడమో లేక టీడీపీ ఎన్డీయే నుండి బయటకు రావడమో జరగకపోతే బీజేపీతో పాటు టీడీపీ కూడా రాజకీయంగా నష్టపోతుంది. మరోవైపు చంద్రబాబు ఇటీవలే ఎన్డీయే నుండి బయటకు వచ్చిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తో ఫోన్ లో మాట్లాడినట్టు నేషనల్ మీడియా సమాచారం. శివ సేన మరో వైపు కేంద్రంపై కాలు దువ్వుతున్న మమత బెనర్జీతో కూడా టచ్ లో ఉన్నట్టు సమాచారం.

దీనిబట్టి మూడవ ఫ్రంట్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలతో బీజేపీ అప్రమత్తం అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబును మరోసారి కొనసాగిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టీడీపీ వ్యతిరేక వర్గంలోని కన్నా లక్ష్మి నారాయణను గానీ, సోము వీర్రాజును గానీ ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడిగా చేస్తారనే ప్రచారం జరిగింది.

ఈ నియామకం బట్టి కాస్త వెనుకకు తగ్గినట్టే అనుకోవాలి. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ మీటింగు జరుగుతుండగానే చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. త్వరలోనే అన్ని విషయాలపై చర్చిద్దామని అమిత్‌షా అన్నారని సమాచారం. అయితే బీజేపీకి ఇదే చివరి అవకాశం కావొచ్చు.