TDP-40 yearsఆన్ లైన్, ఆఫ్ లైన్ అన్న తేడా లేకుండా అంతటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు 40 ఏళ్ళ పార్టీ పండగను జరుపుకుంటున్నారు. నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు అనేక చారిత్రాత్మక కార్యక్రమాలకు, రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు తెలుగుదేశం పార్టీ నాంది పలికిన విషయం చరిత్రపుటల్లో లిఖించబడి ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గానీ, మౌలిక వసతుల సదుపాయాల కల్పన విషయంలో గానీ టీడీపీ చేసినట్లుగా మరే పార్టీ చేయలేదని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి 80వ దశకాల్లో టీడీపీ అమలు చేసిన అభివృద్ధి పధకాలే నేటికీ రాజ్యమేలుతున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలోని ప్రముఖ నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుండి పుట్టి, పెరిగిన వారే.

నాయకులను తయారుచేసి ఏపీ, తెలంగాణాలకు కానుకగా ఇచ్చిన పార్టీగా తెలుగుదేశంకు విశిష్టమైన గుర్తింపు ఉంది. అంతటి ఘనచరిత్ర కలిగిన పార్టీ నేటి కుటిల రాజకీయ చతురతకు అల్లాడుతోంది. అధికారం వస్తే ప్రజాసేవ చేసి రాష్ట్రాభివృద్ధికి పాటు పడే రాజకీయాల నుండి, అదే అధికారంతో ప్రత్యర్థి పార్టీలను కనుమరుగు చేయాలనే రాజకీయాల వరకు అన్నింటిని టీడీపీ చవిచూసింది.

గత ఎన్నికలలో లభించిన ఫలితాలతో పూర్తి నైరాశ్యతతో ఉన్న పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఒక ఏడాదిగా ఊపొచ్చింది. అది ఇప్పుడు ఎలా ఉందంటే… “ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడూ” అనే స్థాయిలో పార్టీని కార్యకర్తలు భుజాన పెట్టుకునేటంతగా ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ చేస్తోన్న కుటిల రాజకీయాలకు బలై పోకుండా పార్టీని నిలబెట్టేందుకు కార్యకర్తలు చేస్తోన్న కృషి అనిర్వచనీయం.

క్షేత్రస్థాయిలో అంతటి బలం టీడీపీ సొంతం. ఎంతోమంది నాయకులు పార్టీలు మారినా, పార్టీకి ద్రోహం చేసినా మరో నాయకుడిని తయారు చేయగల సత్తా టీడీపీ పార్టీకి, క్యాడర్ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే నాడు వైఎస్ హయాంలో ఎంతమంది దిగ్గజాలు పార్టీ వదిలి వెళ్ళిపోయినా, మలిదశ ఎన్నికలలోనే మళ్ళీ అధికారం చేజిక్కించుకుంది. ‘టీడీపీ పనైపోయింది’ అన్న ప్రతిసారి ‘పడి లేచిన కెరటం’ లాగా ఉవ్వెత్తున ఎగసి పడుతుంటుంది.

అదే విధంగా మరోసారి నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. రాబోయే 2024 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. ఆ మాటకొస్తే ఒక్క టీడీపీకే కాదు, ఏపీ భవిష్యత్తును కూడా 2024 ఎన్నికలు దిశానిర్ధేశం చేసేవిగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పసుపు జెండా ఎగరడం అనేది టీడీపీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కు అనివార్యంగా మారింది.

ప్రపంచపటంలో మరోసారి ఏపీ నిలవాలంటే “పసుపు” జెండాను రెపరెపలాడేలా చేయడం నేతలు, కార్యకర్తల బాధ్యత. అయితే ఇది అనుకున్నంత సులువు అయితే కాదు. ఎందుకంటే దేశ, రాష్ట్ర రాజకీయాలు ఓ పద్ధతిగా సాగడం లేదనేది జగమెరిగిన సత్యమే. ఆ కుటిల రాజకీయాలను చేధించుకుని, మళ్ళీ అధికార పీఠంపై టీడీపీ కూర్చోవడం అనేది, 40 ఏళ్ళ అనుభవానికి అగ్ని పరీక్షగా మారిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.