Tatiparthi Jeevan Reddy won in Telangana MLC Electionsతెలంగాణలో జరిగిన శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ అండగా ఉన్న అందరూ అభ్యర్థులు ఓడిపోయారు. ప్రస్తుత శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు ఓటమి పాలయ్యారు. అదే సమయంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్నందున తెరాస నేరుగా ఎవరికీ మద్దతు ఇవ్వలేదు.

అయితే తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజాప్రతినిధులు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. మరోవైపు జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. విపక్షాలు సహకారం అందించాయి. దీనితో ఈ ఎన్నికల ఫలితాలు అధికారపక్షంపై ప్రతిపక్ష విజయంగానే చూడాలి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు ఈ ఫలితం మంచి ఊపు నిచ్చేదే అనుకోవాలి. గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రతీ ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేక ఫలితాలే. ఇటీవలే శాసనసభ ఎన్నికలో ఘోరపరాజయం తరువాత ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు అందరూ తెరాస గూటికి చేరుతున్నారు.

మండలిలో ఖాళీ చెయ్యాలని ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కు దక్కే ఒక్క సీటు కూడా రాకుండా చేసింది తెరాస ఈ ఫిరాయింపులతో. అయితే డైరెక్టుగా ప్రజల మద్దతుతోనే కాంగ్రెస్ మండలిలో తన అభ్యర్థిని పెట్టుకుంది. ఈ ఉత్సాహంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కనీసం తన ఖాతా తెరుస్తుందేమో చూడాలి. మరోపక్క తెరాస రాష్ట్రంలో ఉన్న 17 సీట్లకు గానూ తాను 16, మిత్రపక్షమైన ఎంఐఎం ఒకటి గెలుచుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. మొత్తం 17 గెలిస్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పి తెలంగాణాకు రావలసిన హక్కులు అన్నీ పట్టుకు వస్తారని ప్రజలను ఊదరగొడుతుంది.