Tarun responds on drugs caseడ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్న సినీ సెలబ్రిటీలు మీడియాను ఫేస్ చేయడానికి సాహాసించ లేకపొతున్నారన్న మాట వాస్తవం. బహుశా విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో ఒకటి, రెండు ముక్కలు మాట్లాడడమో లేక ఓ నమస్కారం పెట్టడమో చేస్తున్నారు గానీ, గంటల తరబడి కొనసాగుతోన్న సిట్ విచారణ తర్వాత మాత్రం మీడియాను ఎదుర్కొవడానికి సెలబ్రిటీలంతా విముఖత చూపుతున్నారు. మీడియా కెమెరాలకు చిక్కకుండా వెళ్లిపోవడానికి వీలుగా విచారణ ముగిసిన వెంటనే తమ వాహనాలను సిద్ధం చేసుకుంటూ పరుగులు పెడుతున్నారు.

అయితే ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత వివరణ ఇచ్చుకుంటూ ఓ రెండు, నిముషాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ముందుగా హాజరైన పూరీ జగన్నాధ్ ఈ క్రమాన్ని మొదలుపెట్టగా, తాజాగా తరుణ్ కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఫేస్ బుక్ లో తన వీడియోను పోస్ట్ చేసాడు. వీరిద్దరూ చెప్పింది ఒక్కటే… డ్రగ్స్ మేం తీసుకోలేదు, నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా ప్రసారాల వలన తమ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు, సెన్సేషన్ కోసం సినీ సెలబ్రిటీలపై కధనాలు ప్రసారం చేస్తున్నారు… వగైరా వగైరా..! సిట్ విచారణ పూర్తి కాగానే ఫేస్ బుక్ వేదికగా ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ డైలాగ్స్ బలంగా వినపడుతున్నాయి.

నిజమే… వీరి వాదనలో కొంత అర్ధముందని చెప్పడంలో సందేహం లేదు. అయితే సినీ సెలబ్రిటీల విషయంలో మీడియా ఈ ఒక్క విషయంలోనే ఇలా వ్యవహరించదన్న విషయం గమనించవచ్చు. ఏ సినిమాకు సంబంధించిన సంచలన విషయం లీక్ అయినా, అధికారికంగా విడుదలైనా ఇదే రకమైన ప్రచారాన్ని ఇస్తూ ఉంటుంది. వర్తమానంగా ఏ అంశం అయితే హైలైట్ గా నిలుస్తుందో అదే అంశంపై ఒకటికి పది కధనాలు ప్రసారం చేయడం నేడు మొదలైంది కాదు, అలాగే ఈ డ్రగ్స్ కేసుతో ముగిసేది అంత కన్నా కాదు. సినిమాల పబ్లిసిటీ విషయం వ్రేలేత్తని సెలబ్రిటీలు, ఇలాంటి ఆరోపణల కధనాలపై ప్రశ్నించడాన్ని మీడియా వర్గీయులు సైతం అంగీకరించడంలేదు.

ఈ సెలబ్రిటీలంతా ఒక్కసారి మీడియా ముందుకు వస్తే ఎదురయ్యే పరిస్థితి ఊహలకందనిది. సిట్ విచారణలో భాగంగా ఎన్ని ప్రశ్నలు అడిగారో చెప్పలేం గానీ, మీడియా వర్గీయులు మాత్రం వీరంతా ఎప్పుడెప్పుడు దొరుకుతారా? అంటూ వేయికళ్లతో వేచిచూస్తున్నారు. అందుకే సెలబ్రిటీలు కూడా మీడియాను ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. పూరీ, తరుణ్ లు మాత్రమే కాదు, ఇంకా విచారణలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు గనుక… వారు కూడా భవిష్యత్తులో మీడియా కంటే ఫేస్ బుక్కో, ట్విట్టరో ముద్దు అనే అవకాశాలు లేకపోలేదు. తమ ఆవేదనను వ్యక్తం చేసుకోవడానికి సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఒక ఫ్లాట్ ఫాం అయ్యింది.