Taraka Ratnaస్టార్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలు లేదా నటుల జీవితం బయటికి అద్దాల మేడలాగే కనిపిస్తుంది. అందుకే తేలిగ్గా రాళ్లు పడతాయని ఇదే టైటిల్ తో సినిమా తీసిన దాసరి నారాయణరావు గారు ఎప్పుడో చెప్పారు. యాక్టర్ గా పుడితే చాలు సర్వభోగాలు ఒళ్ళో కొచ్చి వాలతాయనే భ్రమ చాలామందిలో ఇప్పటికీ ఉంది. ఇది కేవలం నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇక్కడ సపోర్ట్ గాడ్ ఫాదర్లు ఉన్నంత మాత్రాన నెగ్గుకు రాగలమన్న గ్యారంటీ లేదు. టాలెంట్, సక్సెస్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ మూడింటిలో ఏది బ్యాలన్స్ తప్పినా గెలవడం కష్టం. ఇటీవలే హార్ట్ అటాక్ కు గురైన తారకరత్న ఆరోగ్యం గురించి సానుకూల వార్తలు వినడం గమనిస్తున్నాం.

అందరూ కోరుకుంటున్నది అదే. మాములుగా ఇతనిది బంగారు చెంచాతో మొదలైన జీవితమని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిపాడని అనుకోవడం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ ఇందులో అంతా నిజం కాదు. 2002 మార్చి 24న ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకున్న డెబ్యూ హీరోగా తారకరత్న గురించి మీడియాలో బోలెడు కథనాలొచ్చాయి. బాలకృష్ణ అన్నయ్య మోహనకృష్ణ వారసుడిగా తన మీద సాఫ్ట్ కార్నర్ ఉండేది. చాలా అట్టహాసంగా జరిగిన వేడుకకు అప్పటి సిఎం చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, హరికృష్ణలతో పాటు మొత్తం నందమూరి ఫ్యామిలీ హాజరయ్యింది. ఆయా చిత్రాలకు సంబంధించిన దర్శకులు నిర్మాతలతో ఆ రోజు ఓపెనింగ్స్ ఎంత సందడిగా జరిగాయో మళ్ళీ ఎవరికీ అది రిపీట్ కాలేదు.

తీరా చూస్తే వాటిలో సగం మటుకే సెట్స్ దాకా వెళ్లాయి. కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకున్నవి లేవు. కొన్నేళ్ల పాటు హీరోగా చేస్తూ వచ్చాడు కానీ ఫెయిల్యూర్స్ వల్ల క్రమంగా మార్కెట్ కిందకు వెళ్లడం మొదలయ్యింది. వ్యక్తిగత జీవితం తారకరత్నను బాగా ఇబ్బంది పెట్టిందనేది సన్నిహితుల మాట. ప్రేమ వివాహం చేసుకున్నాక రెండు కుటుంబాలు వీళ్ళను దూరం పెట్టడంతో డిప్రెషన్ కు గురవ్వడం, ఆ తర్వాత తలెత్తిన హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మద్యపానం లాంటి అలవాట్లకు దారి తీశాయని అంటారు. దానికి తోడు కెరీర్ కూడా ఆగిపోవడం అతని మనోస్థైర్యాన్ని మరింత దెబ్బ తీసింది. 2012లో అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నాకే కొంత మెరుగయ్యింది.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి భార్య స్వంత చెల్లెలి కూతురే ఈ అలేఖ్యనే సంగతి ఇటీవలే బయటికి వచ్చింది తప్ప నిజానికి ఈ విషయం అధికారికంగా ఎప్పుడూ చెప్పే అవసరం తారకరత్నకు రాలేదు. రవిబాబుతో తీసిన అమరావతితో విలన్ గా నంది అవార్డు అందుకున్నప్పటికీ తనకు సెకండ్ ఇన్నింగ్స్ అచ్చిరాలేదు. రాజా చెయ్యి వేస్తే లాంటి ఎన్నో సినిమాల్లో ప్రతినాయకుడిగా నటిస్తే అవన్నీ డిజాస్టర్లే. కొందరు ప్రొడ్యూసర్లు లో బడ్జెట్ తో ఏవేవో తీశారు కానీ అవి కనీసం ప్రింట్ ఖర్చులు కూడా వసూలు చేయలేదు. క్రమంగా ఇండస్ట్రీ మీద ఆసక్తి తగ్గిపోయిన తారకరత్న ఇటీవలే రాజకీయప్రవేశం చేయడం, లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపే క్రమంలో అనూహ్యంగా గుండెపోటుకు గురి కావడం విధిరాత. అదృష్టవశాత్తు కోలుకుంటున్నాడు కానీ బయట చెప్పుకుంటున్న అందంగా అతని లైఫ్ గడవలేదన్నది వాస్తవం.