ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌లో తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలియజేసింది. నిన్న రాత్రి ఒంటిగంటకి హాస్పిటల్ వచ్చేసరికే ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి పూడుకుపోయిన రక్తనాళాలలోకి రక్తాన్ని పంపింగ్ చేస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది. తారకరత్నకి అత్యవసర చికిత్సలు అందించేందుకు పలువురు సీనియర్ కార్డియాలజిస్టులు, ఇతర నిపుణులైన వైద్యులని ఏర్పాటు చేశామని, వారు నిరంతరంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారని, కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
నందమూరి తారక రామారావు కుమారుడైన నందమూరి మోహన కృష్ణ తనయుడు తారకరత్న. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్‌తో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నప్పుడు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక పీఎస్ఈ వైద్య కళాశాలలో చేర్పించి అత్యవసర చికిత్సలు చేశారు. ఆ తర్వాత బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ వైద్యుల బృందం కుప్పం చేరుకొని రాత్రి వరకు అక్కడే అత్యవసర చికిత్సలు అందించి, నిన్న అర్దరాత్రి అంబులెన్సులో బెంగళూరుకి తరలించారు.