Tantrik-Ritual-Performed-at-Kanaka-Durga-Templeఇటీవల సంచలనం సృష్టించిన విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం నిజమేనని తేలింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించిన మాట వాస్తవమేనంటూ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆమంచి సృజన్, ఘంటసాల పార్థసారథి అనే ఇద్దరు ప్రైవేటు పూజారులు తాంత్రిక పూజలకు సంబంధించి అన్ని వివరాలను విచారణలో పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.

కాల్ డేటా ఆధారంగా ఆలయ సిబ్బంది, అధికారుల మధ్య ఫోన్ కాల్స్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 26 రాత్రి 10:30 గంటల సమయంలో అమ్మ వారి అలంకారం తొలగించి తాంత్రిక పూజలు నిర్వహించిన విషయం అప్పట్లో పెను దుమారం రేపింది. పూజ అనంతరం అమ్మ వారికి మద్యం, మాంసంతో నైవేద్యం పెట్టిన పూజారులు శుద్ధి చేయడం మర్చిపోవడంతో వ్యవహారం బయటపడింది.

కాగా ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించిన మాట నిజమేనంటూ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయంలోనే ఈ రకమైన పూజలు జరపడం అనేది సామాన్య ప్రజలకు, భక్తులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది. మరి దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.