Tanneru Harish Rao to lead trs in Dubbaka byelectionsదుబ్బాక ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 3 న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతుంది. నవంబర్ 10న కౌంటింగ్ జరిపి అదే రోజు ఫలితాలు విడుదల చెయ్యనున్నారు. సిట్టింగ్ తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.

వారి కుటుంబ సభ్యులకే తెరాస టిక్కెట్ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. బీజేపీ తరపున పార్టీ సీనియర్ నేత రఘునందనరావు పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికలలో పోటీ చేసిన ఆయన కేవలం 18% ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.

అయితే ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో దుబ్బాక సెగ్మెంట్ లో గణనీయంగా ఓట్లను పెంచుకుని రెండవ స్థానంలో నిలిచింది బీజేపీ. దీనితో ఆ పార్టీ వారు ఈ సీటు పై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు.. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని మోహరించింది.

పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడంతో పాటు, ఉపఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. మండల స్థాయిలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించి గ్రామాల వారీగా పార్టీ కేడర్‌ను కూడగడుతున్నారు. దీనితో పోటీ హోరాహోరీగా ఉండబోతుంది.