tammreddy-bharadwaja-pawan-kalyan-cheneta-garjanaటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ పేరిట యూ ట్యూబ్ ద్వారా పలు విమర్శలు చేశారు. ‘చేనేత గర్జన’ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై పెదవి విరిచారు. చేనేత కార్మికుల గురించి ‘జనసేన’ వెబ్ సైట్ గురించి బాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్… ప్రత్యేక హోదాపై మరోసారి నిరాశపడేలా మాట్లాడారని, ప్రతి సభలోనూ ప్రత్యేక హోదా ఎందుకు వద్దంటున్నారో రాజకీయ నాయకులు ప్రజలకు సరళమైన భాషలో వివరించాలని కోరుతున్నారని, అయితే, వాస్తవానికి వారంతా ఎందుకు హోదా ఇవ్వడం లేదో విడమరచి మరీ చెప్పేశారని అన్నారు.

అయితే గతంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఇపుడు వివరించలేదని, బహుశా పవన్ కళ్యాణ్ కు అలా చెబితే సరిపోతుందా? అని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ, రాదని టీడీపీ స్పష్టంగా చెబుతున్నాయని… ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు చేతనైతే పోరాటం చేయాలని సూచించారు. జనవరి 26న ప్రత్యేక హోదా సాధన ఆందోళనకు పిలుపునిస్తే, సంపూర్ణేష్ బాబు మద్దతుగా వచ్చి అరెస్టయ్యాడని, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదని గుర్తు చేశారు. అమెరికాలోనూ, ఇక్కడా పదే పదే ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని, మాటలు కాదు చేతలు కావాలని గుర్తించాలని తమ్మారెడ్డి సూచించారు.

రాజకీయ పార్టీలన్నీ 2019లో విజయం సాధించేందుకు ప్రత్యేక హోదాను తలకెత్తుకుంటున్నాయని, అలా కాకుండా పవన్ కళ్యాణ్ హోదాపై ఉద్యమానికి రావాలని సూచించారు. అలా చేస్తే ప్రజలంతా ఆయన వెనుక ఉంటారని, పవన్ కళ్యాణ్ తనకు ఫిరంగులకు గుండెలడ్డంపెట్టేవారు కావాలంటున్నారని, ప్రత్యేక హోదా పోరాటం కోసం జనవరి 26న అరెస్టైన వారంతా అలాంటి వారు కాదా? అని నిలదీశారు. ప్రజాపక్షాన నిలబడాలనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని భావిస్తున్నామని, అది నిజం కావాలంటే పవన్ కళ్యాణ్ మాటలు తగ్గించి, కార్యరంగంలోకి దూకాలని సలహా ఇచ్చారు.