Ram Gopal Varmaరామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ నెల 29న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా తనను అవమానకరంగా చూపిస్తున్నారని ప్రముఖ మతప్రబోధకుడు కెఏ పాల్ హైకోర్టుని ఆశ్రయించారు. సినిమా విడుదలను ఆపివెయ్యాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు.

ఇందులో కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, రామ్‌గోపాల్ వర్మ, కమెడియన్ రాము, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు కేఏ పాల్. ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని కూడా అవమానించారు రాము. శాసనసభలో ఆయన (అలీ ఆ పాత్ర పోషించారు) స్పీకర్ స్థానంలో కూర్చుని నిద్రపోతున్నట్టుగా చూపించారు వర్మ.

దీనిపై తమ్మినేని స్పందించారు. “వర్మ అలా చిత్రకరించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న,” అంటూ చెప్పుకొచ్చారు ఆయన. సహజంగా ఇటువంటి వాటిపై స్పీకర్లు ఘాటుగా స్పందిస్తారు. రాజ్యాంగ స్థానంలో ఉన్న తమను విమర్శించినా అవమానించినా గట్టిగా స్పందించారు. అయితే తమ్మినేని మాత్రం రాముని వదిలేశారు.

బహుశా తమ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న సినిమా కాబట్టి లైట్ తీసుకుని ఉంటారు. ఇది ఇలా ఉండగా సినిమా 29న వస్తుందో లేదా అనేదాని పై క్లారిటీ లేదు. ట్రేడ్ కూడా సినిమా మీద పెద్దగా ఆసక్తి లేదు. అదే సమయంలో కోర్టు కూడా ఎలా స్పందిస్తుందో చూడాలి.