tammareddy bhardwaj comments about industry pedda dikkuగత కొన్ని రోజులుగా ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశమైన ‘ఇండస్ట్రీ పెద్ద’ వ్యవహారంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘ఇండస్ట్రీ పెద్ద’గా ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉన్నారని, అలా ఉండాలని ఆయన్ని ఎవరూ నియమించలేదని, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఎవరికి ఆపద వస్తే వారు దాసరి దగ్గరికి వెళ్లే వారని అన్నారు.

అలా వ్యవహరించగల వ్యక్తి దాసరి నారాయణరావు తప్ప మరొకరు లేరని, ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రంగాలలో ఆయనకున్న పట్టు, జ్ఞానం మరొకరికి లేవని తేల్చి చెప్పారు. ఒక నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, ఎగ్జిబిటర్ గా, పంపిణి దారుడిగా, కార్మికుడిగా, సంగీత దర్శకుడిగా… ఇలా ఒకటేమిటి ఇండస్ట్రీ ఆయనకు లేని పరిజ్ఞానం లేదని వివరించారు.

అందుకే అన్ని వర్గాల వారు దాసరి వద్దకు వెళ్లి తమ సమస్యలు చర్చించే వారని, 24X7 ఏ సమయంలో అయినా ఆయన అందరికి అందుబాటులో ఉండేవారని, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా నేరుగా దాసరి వద్దకు వెళ్లి కలిసే సదుపాయం ఉండేదని, అలా ఎవరి వల్లా కాదని, ఇండస్ట్రీ కోసం అంత సమయం కూడా దాసరి కేటాయించేవారని స్పష్టం చేసారు.

ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరికి వారు తోచిన సాయం చేస్తున్నారని, ఇటీవల చిరంజీవి కూడా అవసరమైనపుడు తాను అందుబాటులో ఉంటానని చెప్పారని, చిల్లర పంచాయితీలు చేయనని చెప్పారు తప్ప, వేరేగా స్పందించలేదని, ఇప్పటికే ఇండస్ట్రీకి చేతనైన సహాయం చేస్తున్నారని, అలాగే బాలకృష్ణ, మోహన్ బాబులు కూడా చేస్తున్నారని చెప్పుకొచ్చారు.