Tammareddy Bharadwaja ticket rates issueఏపీ సీఎంతో చిరంజీవి బృందం భేటీ అయిన విధానంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని ఓ వీడియో రూపంలో తెలియజేసారు. ముందుగా ఏపీ ప్రభుత్వానికి – సినీ పరిశ్రమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పినందుకు సంతోషం కలిగిందని, కానీ ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవం ఉంటుంది, దానిని పక్కన పెట్టి చిరంజీవి అలా మాట్లాడడం చాలా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేసారు.

చిరంజీవి అడిగిన విధానం యాచించినట్లుగా ఉందని పేర్కొన్న తమ్మారెడ్డి, నిజానికి ఈ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ ఉందా? అని ప్రశ్నించారు. ఈ భేటీలో టికెట్ ధరల విషయం తప్ప, ఇతర అంశాలేవీ చర్చించినట్లుగా లేరని, అలా కాకుండా ఇతర సమస్యలను కూడా ప్రస్తావించినట్లయితే అందరం సంతోషించే వారమని చెప్పుకొచ్చారు.

టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూడా “అఖండ, పుష్ప” సినిమాలు మంచి వసూళ్లు సాధించాయని, ఒకవేళ టికెట్ ధరలు పెరిగి ఉన్నట్లయితే, ఆ తేడా 20 నుండి 25 కోట్ల వరకు ఉండేదని, అంత మాత్రం దానికి చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి తదితరులు వెళ్లి ఆ విధంగా అడగాలా? ఏ మాత్రం అవసరం లేదన్న భావాన్ని తమ్మారెడ్డి వ్యక్తపరిచారు.

తెలుగు ఇండస్ట్రీ ఉన్న మనమంతా శాశించే వాళ్ళము కాకపోయినా, పన్నులు కడుతున్న వారమని, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటూనే మాట్లాడాలని, అణగారిపోయిన వర్గంలా ఉండాల్సిన ఆవశ్యకత లేదని, ఈ మొత్తం వ్యవహారం జరిగిన తర్వాత తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు తమ్మారెడ్డి. స్వతహాగా చిరంజీవి పెద్ద మనిషి, ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా పెద్దగా సీఎం వద్దకు వెళ్లారని “ఇండస్ట్రీ పెద్ద”పై జరుగుతున్న చర్చకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.