Tammareddy Bharadwaj Comments on Pawan Kalyanఇటీవల పవన్ ఇచ్చిన ప్రెస్ మీట్ లో… “ప్రస్తుతం తన కారు కదిలే పరిస్థితే లేదు, ఇక పాదయాత్రలంటే ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తున్నానని, తనకు పాదయాత్రలు చేయాలని ఉన్నా… శాంతిభద్రతలకు విఘాతం కలుగకూడదని భావించి, ఇలాంటివి ప్లాన్ చేయడం లేదని, అయితే ఏదొక రూపంలో అయితే ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తానని” స్పష్టం చేసారు. తాజాగా ఈ వ్యాఖ్యలను విశ్లేషిస్తూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

రాజకీయాల్లోకి రావడమంటేనే ప్రజల్లోకి రావడమని, ప్రజల్లోకి రావడమంటే సమస్యలపై పోరాటానికి ముందడుగు వేయడమని, ఎవరో చెబితే విన్నానని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడడం సబబు కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ చెబుతున్న సెక్యూరిటీ కారణాలు ఇంతవరకు ఎప్పుడూ ఎదురు కాలేదా? ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తుండడం వల్లే ఎక్కువ మంది చూసేందుకు వస్తున్నారని, అదే పవన్ కళ్యాణ్ మీ ఊరు వస్తారని తెలిస్తే ఎవరైనా ఇంకో ప్రాంతంలో చూసేందుకు ఎందుకు వస్తారని లాజిక్ తో మాట్లాడిన వ్యాఖ్యలు సముచితంగానే ఉన్నాయి.

పవన్ కల్యాణ్ కు మద్దతు తెలపాలని ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు, వారిలోకి వెళ్లకుండా, ఎవరో చెప్పగానే సమస్య తెలిసిపోయిందని అనుకోవడం రాజకీయ నాయకుడి అపరిపక్వతను సూచిస్తుందని ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. భద్రతా ఇబ్బందులు అనేవి ఎప్పుడూ ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజల్లోకి వెళ్లడమే ఉత్తమమని, తద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని, అలా కాకుండా ఆఫీసులో కూర్చుని, అనుచరులు చెప్పారని గుడ్డిగా ముందుకు వెళ్లడం సరికాదని, రాజకీయ నాయకుడు సమస్య మూలాల నుంచి తెలుసుకుంటే పరిష్కారాలు వెతకగలడని అభిప్రాయపడ్డారు.

ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకునే వారిపై కూడా తన అస్త్రాలను సంధించారు తమ్మారెడ్డి. ఒకప్పుడు ఉన్న అసలైన అభిమానులు ఇప్పుడు లేరని, ఒకప్పుడు రాజకీయ నాయకుల అభిమానులైనా, సినీ నటుల అభిమానులైనా తమ అభిమాన నేత లేదా హీరో ఏదైనా చెబితే దానిని జవదాటే వారు కాదని, ఇతరులను జవదాటనిచ్చేవారు కాదని, ఇప్పుడు అలాంటి అభిమానులు లేరని, ప్రస్తుతం పవన్ వారిస్తున్నా ఆయనపైబడి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపేవారే ఇప్పుడు అభిమానులని… ఫ్యాన్స్ తీరును ఏకరువు పెట్టారు.

వారికి తమ అభిమాన హీరో అన్నా, అభిమాన నేత అన్నా గౌరవం ఉండడం లేదని, అలాంటి అభిమానులు ఉంటే ఎంత? ఉండకపోతే ఎంత? అంటూ కాస్త తీవ్రంగానే స్పందించారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులంతా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లడం ద్వారానే నిజమైన హీరోలుగా మారారని గుర్తు చేసిన తమ్మారెడ్డి, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి భద్రతతోనే బయటకు వెళ్లేవారని, ఇప్పుడు మాత్రం ఆయన భద్రత లేకుండా బయటకు వెళ్లరనే తాను అనుకుంటున్నానని, ఏవైనా తేడాలు చేస్తే, వారే వారిని అడ్డుకుంటారని, అలాంటి ఆలోచనలు వీడి ప్రజల వద్దకు వెళ్ళాల్సిందిగా పవన్ కు సూచనలు చేసారు తమ్మారెడ్డి భరద్వాజ.