tamil-white-tigerతమిళనాడు జూలో పుట్టి పెరిగిన తెల్లపులి ఒకటి హిందీ భాషలో మాట్లాడితే గుండెలదిరిపోయేలా గాండ్రిస్తోంది. తమిళ భాషలో ఆదేశాలిస్తే పాటించే ఈ తెల్లపులి, హిందీ భాషలో మాట్లాడితే మాత్రం గాండ్రింపులే.. గాండ్రింపులు! ఇంతకీ, ఈ తెల్లపు కథేమిటంటే… రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లోని సజ్జన్ ఘర్ జూపార్క్ లో ‘ధామిని’ అనే ఆడ తెల్లపులి ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో అది వయసుకొచ్చింది. దానికి సరైన జోడీ కోసం దేశంలోని అన్ని ‘జూ’ల నుంచి ఆ జూపార్కు అధికారులు సమాచారం సేకరించారు.

చివరకు, చెన్నైలోని వండలూరు జూపార్కులో ‘రామ’ అనే మగ తెల్లపులిని గుర్తించారు. వస్తుమార్పిడి విధానం లాగానే, జంతుమార్పిడి విధానం కింద ఆ మగ తెల్లపులిని తీసుకువచ్చేందుకు, రెండు నక్కలను ‘వండలూరు జూ పార్క్’కు ఇచ్చి, ఆ పులిని తెచ్చుకునేలా, ఉదయ్ పూర్ ‘జూ’ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది… కానీ, అసలు సమస్య ఉదయ్ పూర్ ‘జూ’ అధికారులకు ఇక్కడే మొదలైంది.

ఎందుకంటే, తమిళ భాషలో మాట్లాడితే కానీ ‘రామ’ అనే పిలవబడే తెల్లపులి ఏమీ తెలుసుకోలేదు. కానీ, ఉదయ్ పూర్ అధికారులకు తమిళ భాష రాదు. దీంతో, హిందీ భాషలో వారు ఆదేశాలిస్తుండటంతో, ఆ భాష అర్థంకాని ‘రామ’కు చిర్రెత్తుతోంది. ‘ఆవో…’ అంటే గాండ్రుమంటోంది.. ‘జావో’ అంటే మరింతగా గాండ్రిస్తోంది. దీంతో, తలలు పట్టుకున్న అధికారులకు ఒక ఆలోచన వచ్చింది. తమిళ భాష తెలిసిన సిబ్బందిని తమకు కేటాయించాలని వండలూరు జూపార్క్ అధికారులకు ఉదయ్ పూర్ జూపార్క్ సూపరింటెండెంట్ మోహన్ రాజ్ ఇటీవల ఒక లేఖ రాశారు.

ఇక తమిళం తెలిసిన సిబ్బంది వచ్చే దాకా ‘రామ’కు తిప్పలు తప్పవు, తమకు దాని గాండ్రింపులు వినక తప్పదని ఉదయ్ పూర్ ‘జూ’ సిబ్బంది అంటున్నారు. అయితే, ‘భాష’ సమస్య కాదు, స్థలం మారడం వలనే దానికి కొంచెం కొత్తగా ఉందని కొందరు అంటున్నారు. కాగా, 2011లో వండలూరు ‘జూ’లో ‘రామ’ జన్మించాడు. ఈ పరిణామం చూసిన నెటిజన్లు… తమిళ జనాలే కాదు… తమిళనాట జన్మించిన పులులకు కూడా భాషపై మక్కువ ఎక్కువని వ్యాఖ్యానిస్తున్నారు.