tamil nadu chief minister Palaniswami responds to pawan kalyan tweetజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ట్విట్టర్ లో బిజీగా ఉంటున్నారు. ట్విట్టర్ ద్వారానే ప్రభుత్వానికి తన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయనకు తమిళంలో ట్వీట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే… ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ దగ్గర చిక్కుకుపోయారు. ఈ విషయం తమ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్… వారిని ఆదుకోవాలని ఏపీ, తమిళనాడు సీఎంలకు విజ్ఞప్తి చేశారు.

దీనిపై పళనిస్వామి స్పందించారు. సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని.. వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఏపీ సీఎంవో నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న రాజకీయ అగాధం తెలిసిందే. నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు. అయితే రాజకీయ విబేధాలు పక్కన పెట్టి, సమస్య ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పుడు స్పందిస్తే హుందాగా ఉండేది అని పలువురు అంటున్నారు.