tamil-actor-anand-raj-sensational-comments-on-sasikala-natarajan-and-apolloఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం దివంగత జయలలిత ‘నెచ్చెలి’ శశికళ తొందరపాటు ప్రదర్శిస్తున్నారని ప్రముఖ సినీ నటుడు “పెదరాయుడు, బాషా” వంటి విజయవంతమైన సినిమాల్లో ప్రతినాయక పాత్రలలో రాణించిన ఆనంద్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇదే ప్రశ్న సామాన్యులందరి మదిలోనూ మెదులుతోందని ఓ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జయలలిత మృతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, తమిళనాట ప్రజల్లో ఉన్న అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత అపోలో ఆసుపత్రిపై ఉందని అన్నారు. జయలలితను చూసేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను అనుమతించలేదన్న విషయం తనకు తెలియదని చెప్పారు. అమ్మ మరణ వార్త ప్రకటనకు ముందే పార్టీ శాసనసభ్యుల సమావేశం నిర్వహించడమనేది పూర్తిగా పార్టీ అంతర్గత విషయమని, అయితే ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు ముగియక ముందే శశికళ నాయకత్వం వహించాలంటూ డిమాండ్లు తెరపైకి రావడం బాధాకరమని అన్నారు.

ఇలాంటి తొందరపాటుతో చర్యలతో పలు ప్రశ్నలు, అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరించారు. అంతా వారి అధీనంలోనే ఉన్నప్పుడు, వేరెవరూ లాగేసుకునే అవకాశం లేనప్పుడు తొందర ఎందుకని ప్రశ్నించిన ఆనంద్ రాజ్, నెమ్మదిగా కార్యాచరణలోకి దిగాలని సూచించారు. శశికళ నాయకత్వాన్ని కోరుకోవడం అనేది వారి వారి వ్యక్తిగత విషయమని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నా కార్యకర్తగా తాను సేవలందిస్తానని స్పష్టం చేశారు.