Talasanu srinivas yadav son- Araku MP Kothapalli Geetha husband Parachuri Rama Koteswara Raoబుధవారం రాత్రి హైదరాబాద్ లో తన భర్త రామ కోటేశ్వరరావును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు కిడ్నాప్ చేసారని ఎంపీ కొత్తపల్లి గీత పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కలకలం రేపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, కేవలం బెదిరింపులు ఎదురయ్యాయని తర్వాత రామ కోటేశ్వరరావు మీడియా ద్వారా వెలిబుచ్చారు. ఈ క్రమంలో తమ భూమికి చెందిన పత్రాలను లాక్కోవడమే కాక కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కొండాపూర్ పరిధిలో వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. జరిగిన విషయాన్నంతా పంజాగుట్ట పోలీసులకు చెప్పడంతో పాటు తనను బెదిరింపులకు గురి చేసిన తలసాని కొడుకు సాయిపైనా ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.

అయితే దీనిపై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఆరోపణలను ఖండించారు. పలు వ్యాపారాల పేరిట తమ వద్ద రామకోటేశ్వరరావు 2013లో 13 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ మొత్తం చెల్లింపు విషయంలో రామకోటేశ్వరరావు ఎప్పటికప్పుడు వాయిదాలు పెడుతూ వచ్చారని, ఈ క్రమంలో తాజ్ కృష్ణ హోటల్ లో డబ్బుల విషయంలో తన కొడుకు రామకోటేశ్వరరావుతో మాట్లాడిన విషయం వాస్తవమేనని, జరిగిన చర్చల్లో భాగంగా డబ్బులడగిన తన కొడుకుతో తన పేరిట ఉన్న ఐదెకరాల భూమి పత్రాలను హామీగా పెడతానని రామకోటేశ్వరరావే స్వయంగా చెప్పారని అన్నారు.

సదరు భూమి పత్రాలను మళ్లీ ఇంటికి వెళ్లి రామకోటేశ్వరరావే స్వయంగా తన కొడుక్కి ఇచ్చారని, ఓ కాగితంపై సదరు పత్రాలు ఇస్తున్నట్లు రాసిచ్చారన్నారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి నవ్వుతూనే వెళ్లిపోయారన్నారు. అయితే తమ వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు రామకోటేశ్వరరావు పన్నాగం పన్ని కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు చేశారని, దీంతో రామకోటేశ్వరరావు వద్ద తీసుకున్న పత్రాలను తాము పోలీసులకు అందజేశామని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబందించి శుక్రవారం మధ్యాహ్నం పూర్తి వివరాలు, ఆధారాలతో మరో మారు మీడియా ముందుకు వస్తానని, ఈ లోగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి తన కొడుకు తప్పుంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించానని కూడా తలసాని చెప్పుకొచ్చారు.