Talasani Srinivas Yadav counter to Jagan Governentసినిమా టికెట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు సర్వత్రా విమర్శల పాలైన విషయం తెలిసిందే. తెలుగు దిగ్గజాలను తన దగ్గరికి రప్పించుకుని అవమానించిన సీఎం తీరు మరింత చర్చనీయాంశంగా మారగా, దీనిపై నరసాపురంలో పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. అలాగే తెలంగాణా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పరోక్షంగా జగన్ సర్కార్ పై సెటైర్లు వేసారు.

అవసరమైతే ఏపీ సర్కార్ తో మాట్లాడతానని చెప్పిన మాట వాస్తవమే గానీ, ఇండస్ట్రీ పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలని, కరోనా వలన ఎన్నో సినిమాలు షూటింగ్ లు ఆగిపోయాయి, సెలబ్రిటీలను పక్కన పెడితే, లక్షల మంది సినీ పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్నారు, ఓమిక్రాన్ వలన మళ్ళీ ప్రొడక్షన్స్ ఆగిపోయాయి, దీనిని చక్కదిద్దే కార్యక్రమం కేసీఆర్ తనకు అప్పచెప్పినట్లుగా తలసాని చెప్పుకొచ్చారు.

“మమ్మల్ని ఎవరూ బ్రతిమాలాడకున్నా, మా దగ్గరికి ఎవరూ రాకపోయినా, మా కమిట్మెంట్ ప్రకారం మేము చేసాము, మా ఇంటి చుట్టూ, మా వెనుక ఎవరూ తిరగవలసిన అవసరం లేదు” అంటూ పరోక్షంగా ఏపీ సర్కార్ పై సెటైర్లు వేసారు. ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా తన భావాలు పంచుకున్న తలసాని, సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ సర్కార్ అతిగా స్పందించిందన్న భావనను వ్యక్తపరిచారు.

మేమయితే టికెట్ ధరలను పెంచడం, తగ్గించడం అనే అవకాశం కూడా వాళ్ళకే ఇచ్చేశామని, అలాగే ఐదో షోకు అనుమతులు కూడా ఇచ్చేసామని, ఇంతవరకు ఇలాంటి సమస్య ఎప్పుడూ తలెత్తలేదని, అందుకే అసలు ఈ చర్చ ఎప్పుడూ జరగలేదని అన్నారు. ప్రతిసారి కోర్టుకెళ్ళి అనుమతులు తెచ్చుకునే పంచాయితీ వద్దని, కేసీఆర్ సినీ పరిశ్రమ అడిగిన వాటికి ఓకే చెప్పారని అన్నారు.

ఆన్ లైన్ వ్యవస్థ వలన ఇంట్లోనే కూర్చుని ఎంత వసూలు అయ్యిందనే విషయం అందరికి తెలుస్తుందని, ఇది తొలుత పరిచయం చేసింది కూడా తామేనని అన్న తలసాని, ఏ నిర్ణయం తీసుకున్నా ఇండస్ట్రీ బాగు కోసమే తప్ప ఇతరత్రా ఉండదని పేర్కొన్నారు. హైదరాబాద్ లోనే అందరమూ ఉంటాము, ఏనాడూ కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టింది లేదు, వాళ్ళు ఇబ్బంది పడింది లేదు, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటాము అన్నారు.

దేశంలో అద్భుతంగా ధియేటర్లు కడుతున్నారని, అలాగే అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి గనుక వాటిని ప్రమోట్ చేస్తాము తప్ప క్రిందకు దించమని అన్నారు. అందుకే మా విషయంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని, మాకేమిటంటే, అస్తమానం వాళ్ళు మా దగ్గరికి రావాలి, తిరగాలి అని మేము కోరుకోము అంటూ మరోసారి జగన్ అవలంభిస్తున్న విధానాన్ని పరోక్షంగా ఎత్తి చూపించారు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్.