Tadepalli Land Notices - YSRCP Jaganఏపీ సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం, ఆ వెంటనే సంబంధిత ప్రాంతంలోకి వైసీపీ అధినేత జగన్ గానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గానీ పర్యటన చేయడం గత రెండేళ్ళుగా సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే ఒకటి, రెండు సార్లు ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గగా, కాలం మాత్రం అలా గడిచిపోతోంది. దీంతో ఇక ఉపేక్షించి లాభం లేదనుకుందో ఏమో గానీ, తాజాగా పెనుమాక భూముల కోసం ఏపీ సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అంచనా వేసిన భూములలో తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామ పరిధిలోని 660.83 ఎకరాల విస్తీర్ణం కోసం 904 మంది యాజమానుల పేర్లు తెలుపుతూ ఈ నోటీసులు విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వైకాపా, ఏపీ సర్కారు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడుతోందని ఆరోపణలు చేసింది. అలాగే చంద్రబాబు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసును కూడా వేయనున్నామని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.

అయితే ఈ సారి పెనుమాకలో పర్యటించడానికి ముందుగా ఎవరు వస్తారు? ఇప్పటికే పవన్ ఓ సారి బహిరంగ సమావేశం కూడా ఏర్పాటు చేసి రైతులతో భేటీ అయ్యారు. అలాగే జగన్ కూడా వివిధ సందర్భాలలో ఈ గ్రామం గుండా వెళ్ళినవారే. అయినప్పటికీ, రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, మళ్ళీ ఈ నేతలు వచ్చినా ప్రజలు నమ్మకాలు పెట్టుకుంటారా? పవన్ ఏమో తన తాజా సినిమా షెడ్యూల్ తో బిజీగా ఉండగా, జగన్ ఏమో తన కేసుల వ్యవహారంతో మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ఈ సారి పెనుమాకకు ఎవరూ రాకపోవచ్చని టాక్.