tadepalli becoming logistic hubతాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరానికి అతి దగ్గరగానూ, త్వరలో నిర్మాణం కానున్న ‘అమరావతి’కి కాస్తంత దూరంగానూ ఉన్నటువంటి తాడేపల్లి మున్సిపాలిటీకి విశిష్ట ప్రాధాన్యత దక్కనుంది. త్వరలో సింగపూర్ ప్రభుత్వం అందించనున్న “మాస్టర్ ప్లాన్” ఫైనల్ కాపీలో ‘తాడేపల్లి’ని లాజిస్టిక్స్ హబ్ గా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

రైలు, రోడ్డు, జల మార్గాలతో పాటు గగన ప్రయాణం కూడా అందుబాటులో ఉండడంతో ‘చతుర్విధ’ రవాణా వ్యవస్థకు తాడేపల్లిని కేంద్రంగా చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విజయవాడ – చెన్నై జాతీయ రహదారి వెంబడి ఉన్న తాడేపల్లికి ‘కృష్ణా కెనాల్ జంక్షన్’ రైలు మార్గంగా ఉంది. విజయవాడ – గుంటూరు రైల్వే వ్యవస్థకు ఈ పాయింట్ ను కూడలిగా ఏర్పాటు చేయాలని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ ఫాంల సంఖ్యను పెంచి, భవిష్యత్తులో అటు అమరావతికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే వీలుగా ఈ ‘కృష్ణా కెనాల్ జంక్షన్’ను అభివృద్ధి చేసి రవాణా వ్యవస్థను పటిష్టం చేయ సంకల్పించారు. దీనికి తోడు విజయవాడలో రానున్న మెట్రో రైలును భవిష్యత్తులో తాడేపల్లి మీదుగా అమరావతికి విస్తరించే ప్రణాళికలను కూడా రచిస్తున్నట్లుగా సమాచారం.

ఇక, బకింగ్ హోం కెనాల్ అభివృద్ధితో జల మార్గం కూడా తాడేపల్లికి చేరువ అవుతుందని సీ.ఆర్.డీ.ఏ భావిస్తోంది. గతంలో విజయవాడ మీదుగా కాకినాడ నుండి పాండిచ్చేరి వరకు జల రవాణా చేసిన దాఖలాలు ఉండడంతో, ఈ కాలువను అభివృద్ధి చేసి భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో ప్రజలు రవాణా సాగించేందుకు మరియు సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారట. అలాగే ఇప్పటికే ఉన్న గన్నవరం విమానాశ్రయానికి తోడు భవిష్యత్తులో మంగళగిరిలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయంతో గగన మార్గం కూడా తాడేపల్లికి చేరువ కానుంది. ఇలా అన్ని మార్గాలతో తాడేపల్లిని రవాణా వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తుది “మాస్టర్ ప్లాన్”లో ఉండబోతున్నాయని సమాచారం.