t20 match cricket stadium pitches, ICC World T20, india cricket stadium “బ్యాటింగ్ పిచ్ లకు ఇండియా స్వర్గధామం.” ఈ నానుడి క్రికెట్ కు ఆదరణ పెరిగి పెద్దదైన నాటి నుండి ప్రపంచ వ్యాప్తంగా వినపడింది. ఒకానొక సమయంలో అయితే ఇండియన్ పిచ్ లపై టెస్ట్ మ్యాచ్ లు ఆడడం అనవసరం, ఆడితే అవి ‘డ్రా’ మ్యాచ్ లే అవుతున్నాయి… అంటూ విమర్శకులు విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి అంతటి బ్యాటింగ్ పిచ్ లకు నిలయమైన ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతోంది? ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినా… ప్రస్తుతం జరుగుతున్న టీ 20లకు క్యూరేటర్లు ఎలాంటి పిచ్ లను రూపొందిస్తున్నారు? అన్న ప్రశ్నలకు ఆస్కారం కల్పించే విధంగా పిచ్ ల టాపిక్ తెరపైకి వచ్చింది.

టీ20 అంటే ఓవర్ కు 10 పరుగుల చొప్పున బ్యాట్స్ మెన్లు చెలరేగిపోయి దాదాపు 180 – 200 మధ్య స్కోర్ ను నమోదు చేస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నదేంటి? కనీసం ఓవర్ కు 6 పరుగుల చొప్పున రన్ రేట్ తో పరుగులు చేయడానికి జట్లు ముప్పతిప్పలు పడి మూడు చెరువుల నీళ్ళు తాగుతున్నాయి. మరో విశేషమేమిటంటే… సొంత పిచ్ లపై అద్భుతాలు సృష్టిస్తుందనుకున్న టీమిండియా సైతం బొక్కాబోర్లా పడే విధంగా పిచ్ లు ఉండడంతో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

జరుగుతున్నటువంటి ప్రపంచ కప్ లో ఒక్క దక్షిణాఫ్రికా – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మినహాయిస్తే, మిగతా మ్యాచ్ లలో నమోదైన స్కోర్లు కేవలం 6 – 7 పరుగుల రన్ రేట్ మాత్రమే. ఈ మాత్రపు రన్ రేట్ వన్డే మ్యాచ్ లలో మైంటైన్ చేస్తుండడంతో, టీ 20 తన ప్రభావాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే విమర్శకులు మరింత విరుచుకుపడడంతో పాటు ప్రేక్షకులు తీవ్ర నిరాశను వ్యక్తపరిచే ప్రమాదం పొంచి ఉందని క్రీడా విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. టోర్నీలో ఇకనైనా మంచి బ్యాటింగ్ పిచ్ లను క్యూరేటర్లు రూపొందిస్తారని ఆశిద్దాం.