ముంబాయి వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ వీక్షకులకు ‘సండే మజా’ను పంచింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతా ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే అసలు ముంబై గెలిచే అవకాశమే లేదని భావించిన తరుణంలో రానా – హార్దిక్ పాండ్యలు కలిసి అమోఘమైన విక్టరీని అందించి, ఈ ఏడాది పాయింట్ల పట్టికలో ముంబై ఖాతా తెరిచేలా చేసారు.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు, మనీష్ పాండే భీకరమైన బ్యాటింగ్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేయడంతో 178 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. మెక్ లింగన్ వేసిన చివరి ఓవర్ లో పాండే ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఓపెనర్లు పటేల్ – బట్లర్ లు 65 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పతనం కావడంతో, 97 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

దీంతో ముంబై ఆశలన్నీ పొల్లార్డ్ పైనే పెట్టుకుంది. చివరి 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు విజయానికి అవసరమైన తరుణంలో పొల్లార్డ్ కూడా వెనుదిరగడంతో ఓటమి ఖాయమనే భావించారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభ చూపించాడు. అలాగే మరో ఎండ్ లో అప్పటికే ఉన్న రానా కూడా అద్భుతమైన షాట్లతో అలరించాడు. వీరిద్దరి బ్యాటింగ్ తో చివరి 3 ఓవర్లలో విజయానికి 49 పరుగులు చేయాల్సి ఉన్నప్పటికీ, విజయవంతంగా ముగించగలిగింది.

బాండ్ వేసిన 18వ ఓవర్ లో రానా – పాండ్యలు కలిసి 19 పరుగులు రాబట్టగా, రాజ్ పుత్ వేసిన 19వ ఓవర్లో కూడా 19 పరుగులు రాబట్టి, చివరి ఓవర్ లో 11 పరుగుల దూరంలో ఉన్నారు. అయితే 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన రానా, 19వ ఓవర్లో వెనుదిరగడంతో మరో ట్విస్ట్ ఉంటుందని భావించారు. అయితే కీలకమైన చివరి ఓవర్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హార్దిక్ పాండ్య కొట్టిన ఓ షాట్ ను బౌండరీ వద్ద సూర్యకుమార్ మిస్ చేయడంతో, అది కాస్త బౌండరీ లైన్ దాటింది. దీంతో 4 బంతుల్లో విజయానికి 5 పరుగులు చేయాల్సి ఉంది.

ఇక్కడ నుండి మ్యాచ్ మరో మలుపు తిరిగింది. మూడవ బంతిని షార్ట్ పిచ్ గా వేయడంతో ఆడలేక వదిలేసాడు పాండ్య. అలాగే 4వ బంతిని కూడా అదే విధంగా వేయగా, పాండ్య కొట్టిన షాట్ సరిగ్గా బౌండరీ లైన్ వద్ద ఉన్న ధావన్ చేతిలో పడాలి. అయితే ఈ క్యాచ్ ను మిస్ చేయడంతో 2 పరుగులు తీసారు. దీంతో 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా, బాండ్ వేసిన లెగ్ సైడ్ బంతిని బలంగా కొట్టడంతో అది బౌండరీ లైన్ ను తాకింది. ఇది కూడా క్యాచ్ అవకాశమే గానీ, అది ఇది అందుకోవడం చాలా కష్టసాధ్యం. దీంతో చివరి ఓవర్లో కోల్ కతా చేసిన ఫీల్డింగ్ కు తగిన మూల్యం చెల్లించుకుంది. అయితేనేం… ఓ అద్భుతమైన మ్యాచ్ ను మాత్రం రెండు జట్లు అందించాయి. మ్యాచ్ ను ముంబై వైపుకు తిప్పడంలో కీలక పాత్ర పోషించిన రానాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.