T Harish Rao-KCRహరీష్ రావు, కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా హరీష్ ను పక్కన పెడుతున్నారు అనే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంతా భావించారు. అయితే ఈ చర్చ ఇప్పట్లో ముగిసేలా లేదు. కొత్త మంత్రుల చేరికతో మంత్రుల శాఖలలో కొంత మార్పు వచ్చింది. కేటీఆర్ కు గతంలో ఆయన పని చేసిన శాఖలనే తిరిగి అప్పగించారు. అయితే హరీష్ ను మాత్రం తాను బాగా పని చేసిన నీటిపారుదల శాఖ నుండి తప్పించారు. నీటిపారుదల శాఖలో రానున్నారు నాలుగు సంవత్సరాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

చాలా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని కేసీఆర్ సంకల్పించారు. ఆ క్రెడిట్ హరీష్ కు దక్కకూడదనే ఆ శాఖ నుండి తప్పించారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే హరీష్ ను చిన్నబుచ్చినట్టు ఉండకుండా ఆయనకు ఆర్ధిక శాఖ ఇచ్చారు. ప్రాధాన్యత ఉన్న శాఖ కావడంతో హరీష్ అభిమానులు కొంత ఊరట చెందారు. అయితే వెనువెంటనే వారికి షాక్ ఇచ్చారు కేసీఆర్. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టవలసిన ఆర్దిక మంత్రి హరీష్ రావుతో శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగం చదవవలసి వచ్చింది.సాధారణంగా ఆర్దిక మంత్రి అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ ఇస్తారు.

మరో మంత్రి లేదా కౌన్సిల్ కు నాయకత్వం వహించే మంత్రి అక్కడ బడ్జెట్ కాపీని చదువుతారు. అయితే అసెంబ్లీలో కేసీఆర్ స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ జరిగిన దాఖలా లేదని చెప్పాలి. దీనిబట్టి ఆర్ధిక శాఖ అనేది ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉంటుందని, హరీష్ నామ్ కే వాస్తే మంత్రి అని కేసీఆర్ చెప్పదలిచారా? కొందరు మాత్రం కేసీఆరే బడ్జెట్ రూపొందించారు కాబట్టి ఆయన ప్రవేశపెడుతున్నారని సమర్థిస్తున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే కాగితాలు చూసి చదవడమే దానికి కొత్త మంత్రి అయితే ఏంటి పాత మంత్రి అయితే ఏంటి?