T Harish Rao fires on telangana congressతెలంగాణా ఎన్నికల సందర్భంగా వేడి రాజుకుంటుంది. ఉన్నఫళంగా తెలంగాణ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగడం ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చంద్రబాబు నాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ కాంగ్రెస్ వాళ్ళని మళ్ళీ ఆంధ్రోళ్ళ పాలన తెస్తారా అని ప్రశ్నిస్తూ ప్రజలలో సెంటిమెంటు రేకెత్తించే ప్రయత్నం చేసారు.

తెదేపా, కాంగ్రెస్‌లది అనైతిక పొత్తు అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిన్న విమర్శించారు. వీరి పొత్తుతో రాష్ట్ర సాధనకు ప్రాణాలు త్యాగం చేసిన వారి ఆత్మలు ఘోషిస్తాయని అని అన్నారు. అమరులైన వారు రాసిన లేఖ (సూసైడ్‌ నోట్‌)లు తమవద్ద ఉన్నాయని.. ప్రతి లేఖలో చంద్రబాబు పేరు ఉందని.. త్వరలో వాటిని బయటపెడతామని మంత్రి తెలిపారు.

స్వయం పాలన.. తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని తిరిగి చంద్రబాబుకు అప్పగించేందుకు కాంగ్రెస్‌ నేతలు సాగిలపడుతున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అమరవీరుల ఆత్మలు అనైతిక పొత్తులను చూసి ఇప్పుడే ఘోషిస్తాయా? 2004లో కాంగ్రెస్ తో తెరాస పొత్తు పెట్టుకున్నప్పుడు… 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అవి ఏమీ అనవా?

అలాగే తలసాని, తుమ్మల నాగేశ్వరరావుల్ని చేర్చుకుని, మంత్రి పదవులిచ్చి, ఉద్యమకారుల్ని వెంటతరిమిన దానం నాగేందర్ ని పార్టీలో చేర్చుకుంటే అమరుల ఆత్మలు ఆనంద తాండవం చేస్తాయా, హరీష్ గారూ? రాజకీయ పార్టీలు అన్నీ చేసేవి రాజకీయాలే… ఏ పార్టీకైనా చివరికి అధికారమే పరమావధి… మనం గొప్ప అవతలి వారు దిబ్బ అనుకుని సరిపెట్టుకోవడమే!