Sye Raa Narasimha Reddy Movie First Lookచారిత్రాత్మక కధాంశంతో తెరకేక్కిస్తోన్న “సైరా నరసింహారెడ్డి” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎలా కనిపించబోతున్నారు? గడిచిన కొద్ది గంటల ముందువరకు ఇది ఒక ప్రశ్న! కానీ ఇప్పుడు దీనికి జవాబు లభించింది. బాలీవుడ్ బిగ్ బీ పోస్ట్ చేసిన ఫోటోల ద్వారా మెగాస్టార్ చిరంజీవి యొక్క లుక్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సరిగ్గా “రంగస్థలం” రిలీజ్ రోజున ఈ ఫోటోలు విడుదల కావడం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని అందించడానికేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

“స్వామి కార్యం… సకార్యం…” అన్న సామెతకు ఈ ఫోటోలు పరిపూర్ణత ఇచ్చాయి. ఓ పక్కన అమితాబ్ ద్వారా తన లుక్ ను రివీల్ చేయించిన మెగాస్టార్, మరో పక్కన కొడుకు సినిమాకు రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు వెళ్ళేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఇంతకీ ఈ ఫోటోలలో మెగాస్టార్ గారి లుక్ ఎలా ఉంది? అంటే 60 ఏళ్ళు పైబడి రెండు సంవత్సరాలు గడిచినా, చిరులో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదని చెప్పే విధంగా మెగాస్టార్ లుక్ దర్శనమిచ్చింది. పక్కనే ఉన్న నయనతార కూడా మెగాస్టార్ కు సరిజోడిగా ఏ మాత్రం తీసిపోలేదు.