Swaroopananda comments on Shirdi Sai creates controversy in Ongoleమతాల పేరుతో ఇండియాలో జరిగే రచ్చ తెలియనిది కాదు. ఇప్పటికే హిందూ – ముస్లిం పేరుతో కొన్ని దుష్ట శక్తులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండగా, ఇంకొన్ని మతకల్లోలాలు సృష్టించడానికి కొన్ని రాజకీయ శక్తులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా మతాధిపతులు, పీఠాధిపతులు కూడా మతం కోసం ప్రాకులాడుతూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేస్తుండడం విశేషం.

తాజాగా జరిగిన ఓ సభలో ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సాయిబాబాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. సాయిబాబా ఒక మహమ్మదీయుడని, అతన్ని పూజించడం హిందువులు ఆపేయాలని స్వరూపానంద పిలుపునివ్వడం సాయి భక్తులకు కోపం తెప్పించింది. దీంతో అదే సభలో లేచి స్వరూపానందకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసారు. పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీసేలా కనపడడంతో పోలీసులు జోక్యం చేసుకుని, ముందుగా సదరు భక్తులను బయటకు పంపించివేసారు.

ఎవరో కొంతమంది ఆగ్రహం తట్టుకోలేక లేచి ఉండవచ్చు. కానీ, అలా నిరసన తెలియజేయలేని భక్తులు చాలామందే ఉంటారు. అయినా బలవంతంగా ఒకరినే పూజించాలి, ఆ ఒక్కరే దేవుడు అని ప్రజలపై రుద్దే హక్కును ఏ రాజ్యాంగం ఈ పీఠాధిపతులకు కల్పించింది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాయిబాబా దేవుడు కాదంటున్న సదరు పీఠాధిపతి, తానూ కొలిచే దేవుడ్ని చూపించగలరా?

దేవుడు అనే పదం ఒక నమ్మకం. ఏ మతం కూడా వారి దేవుళ్ళను ప్రత్యక్షంగా చూపించలేదు. కేవలం నమ్మకమే ప్రజలను ఆ దిశగా నడిపిస్తుంది. దేవుడు అనేది ప్రజల అభీష్టం. దానిని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం సదరు పీఠాధిపతుల హక్కుగా భావిస్తే… అది నియంతృత్వమే అవుతుంది తప్ప మరొకటి కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇది నేడు సాయిబాబా విషయంలో ఒక పీఠాధిపతి రగిల్చాడనో చెప్పే విషయం కాదు, ఏ దేవుడి గురించైనా, ఏ మతం గురించైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.