Sushanth in Allu Arjun Trivikram Srinivas Movieస్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో హీరో సుశాంత్‌ కూడా నటిస్తున్నారు. గత కొంత కాలంగా ప్లాపులుతో సతమతం అవుతున్న సుశాంత్ గత సంవత్సరం చిలసౌ లాంటి మంచి సినిమాను అందించారు. ఇప్పటి వరకూ హీరోగా నటిస్తూ సడన్ గా సైడ్ హీరో పాత్రకు ఒప్పుకోవడంతో సుశాంత్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినట్టే. ఈ సందర్భంగా సుశాంత్ ట్విటర్‌ వేదికగా ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.

‘అల్లు అర్జున్‌ 19వ సినిమా సెట్స్‌లో ఇది నాకు తొలిరోజు. సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను కానీ నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్‌తో, ‘ఆర్య’ సినిమా నుంచి నేనెంతో ఆరాధిస్తున్న బన్నీతో, టబు, నా స్నేహితురాలు పూజా హెగ్డే, పీఎస్‌ వినోద్‌, తమన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. నాకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ‘చిలసౌ’ తర్వాత ఈ సినిమా నాకు మరో సాహసం లాంటిది. ఈ అద్భుతమైన చిత్రబృందం నుంచి నేనెంతో నేర్చుకోగలనన్న నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

గతంలో త్రివిక్రమ్‌తో కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసిన అల్లు అర్జున్ తన 19వ సినిమాతో మూడో సారి మాటల మాంత్రికుడితో కలిసి పని చేస్తున్నారు. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక హీరో, హీరోయిన్లుగా అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబోలో రెండో మూవీ ఇది. మరోవైపు త్రివిక్రమ్, పూజా కలయికలో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. మ్యూజిక్ డైరెక్టరు థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.