Surya 24 movie teaser talkవిమర్శించడానికి అవకాశం లేని సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ‘మనం’ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంశలు పొందిన దర్శకుడు విక్రం కె కుమార్ తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘24’ కూడా బహు అరుదుగా వచ్చే సినిమాల జాబితాలోకే చేరేటట్లు కనపడుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన “24” టీజర్ ను వీక్షకులంతా ‘మైండ్ బ్లోయింగ్’ అన్న ఒకే ఒక్క మాట చెప్తున్నారు.

నిజంగా టీజర్ కూడా అలాగే ఉంది మరి. విక్రం కె కుమార్ టేకింగ్, సూర్య విభిన్నమైన పాత్రలు, ఏ.ఆర్.రెహమాన్ అద్భుతమైన నేపధ్య సంగీతం, ఫోటోగ్రఫీ… ఇలా అన్ని విభాగాల్లో “24” టీజర్ విమర్శలకు తావ్వివ్వలేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రెహమాన్ అందిస్తున్న సంగీతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉండడంతో, వెల్లువెత్తిన విమర్శలు ఈ సినిమాతో తీరిపోయేలా కనపడుతున్నాయి. కధ గురించి ఈ టీజర్ లో దర్శకుడు హింట్ ఇచ్చినప్పటికీ, సగటు ప్రేక్షకులు అంచనాలకు అందని రీతిలో ఉందనే టాక్ వెలువడుతోంది.

ట్రేడ్ వర్గాలు మాత్రం సూర్య మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని, ‘రోబో’ మాదిరి అతనే విలన్, అతనే హీరో అని చెప్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను, ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొత్తమ్మీద భారీ అంచనాల నడుమ విడుదలైన టీజర్ అయితే అంచనాలను మించే విధంగా ఉండడంతో, ప్రేక్షకుల స్పందన కూడా అదే స్థాయిలో ఉంది.