Survey on YS jagan YSRCP 2019 Electionsప్రముఖ మీడియా సంస్థ చేపట్టిన సర్వేపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఓ పక్కన రాష్ట్రంలో కరెన్సీ కొరత సామాన్యుడిని పట్టి పీడిస్తున్న తరుణంలో బయటకు వచ్చిన ఈ సర్వేలో అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావడంతో వైసీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ సర్వే నిస్పక్షపాతంగా నిర్వహించినది కాదని, ఒక పార్టీకి అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేయడానికి చేసిన సర్వేగా ప్రతిపక్ష వైసీపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

అయితే… ఈ సర్వేలో గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… అధికార టిడిపి ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఓ మూడు జిల్లాలలో మాత్రం వైసీపీదే హవా అని స్పష్టం చేసారు. జగన్ కు మంచి పట్టున్న జిల్లాలుగా కడప, కర్నూల్, నెల్లూరు ఉన్నాయి. ఈ మూడు జిల్లాలలో ఇప్పటికీ జగన్ వెంటే ప్రజలు ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ మూడు జిల్లాలలో ఎక్కువ శాతం సీట్లను జగన్ కైవసం చేసుకోవడం ఖాయమని ఈ సర్వే స్పష్టం చేసింది.

మరి దీనిపై వైసీపీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. నిజంగానే ఇది తప్పుడు సర్వే అయినట్లయితే, ఈ జిల్లాలలో కూడా జగన్ హవా లేదని, అధికార పార్టీ పుంజుకుందని, వలసలతో వైసీపీ కుదేలయ్యిందని… ఇలా రకరకాల కారణాలను చెప్పి ఉండవచ్చు కదా అని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఈ సర్వే తప్పయితే, జగన్ కు ఈ జిల్లాలలో కూడా పట్టు లేదా? అని ఎద్దేవా చేయడం అధికార పార్టీ వర్గాల వంతవుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేదు గనుక, వచ్చే రెండున్నర్ర సంవత్సరాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. మరి అప్పుడు రాజేవరో..!? రెడ్డెవరో..?!