KCR - Surveyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రెండో టర్మ్ లో మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వెలుగు పత్రిక ఒక సర్వే వెల్లడించింది. అందరికంటే ముందున్నప్పటికీ.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది. అదే టైమ్లో ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకుంతుందని ఆ సర్వే చెప్పుకొచ్చింది.

ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ ఓటు శాతం 39.5గా నమోదైంది. కాంగ్రెస్ 26.2 శాతం, బీజేపీ 25.6 శాతం, ఎంఐఎం 2.4 శాతం, ఇతర పార్టీలు 1.6 శాతంగా నమోదైంది. ఏమీ చెప్పలేమన్న వాళ్లు 4.7శాతం మంది ఉన్నారు. నిరుడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్.. నాలుగు నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో 41.29 శాతం ఓట్లకు పరిమితమైంది.

ఇప్పుడు ఆ శాతం మరింత పడిపోయింది అంటున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే అప్పటి తో పోలిస్తే కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకోలేదు. అదే సమయంలో బీజేపీ అనూహ్యంగా బలపడింది. పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీ అంచనాలను మించి 19.45 శాతం ఓట్లను సాధించింది. అప్పటితో పోలిస్తే సర్వే ప్రకారం ఇప్పుడు మరో ఆరు శాతం ఓటు వాటా పెరిగింది.

సంప్రదాయక ఓటర్లు తప్ప కొత్త ఓటు బ్యాంకును ఆకట్టుకోవటంలో కాంగ్రెస్ విఫలమైందని అంటున్నారు. అయితే తెరాస నాయకులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. వెలుగు – వీ6 ఓనర్ గడ్డం వివేక్ ఇటీవలే బీజేపీలో చేరారని, పార్టీ మెప్పు కోసం, ప్రయోజనాల కోసం వేసిన దొంగ సర్వే ఇదని వారు ఆరోపిస్తున్నారు. కేసీఆరే తెలంగాణకు సారు అని వారు గట్టిగా చెబుతున్నారు.